‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ ఆడియో వేడుక

‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథి తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌ సీడి, ఆడియో సీడీ ఆవిష్కరించగా…తొలి సీడీని కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ (దాము) అందుకున్నారు. చిత్రం టీజర్‌ను ‘ఆదిత్యా మ్యూజిక్‌’ ప్రతినిధి మాధవ్‌ విడుదల చేశారు.అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్‌ నటి అన్నపూర్ణ, ఆమె మనవడిగా మాస్టర్‌ రవితేజ నటించిన ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం. ఎమ్మెన్నార్‌ చౌదరి నిర్మాత.
 
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…శివనాగు ఆర్టిస్టు కావాలనుకుని చిత్ర పరిశ్రమలోనికి వచ్చారు. ఆ తర్వాత అభిరుచితో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్‌, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే…పల్లెటూరి వాతావరణాన్ని, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను చాటి చెప్పేవిధంగా ఉంది. వీరి ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ మాట్లాడుతూ… మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు కుటుంబ బంధాలను…వాటి విలువను, ప్రాధాన్యాన్ని చెప్పే ఇలాంటి చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు.
వి.సాగర్‌ మాట్లాడుతూ… అభిరుచి కలిగిన దర్శకుడికి అభిరుచి కలిగిన నిర్మాత తోడు కావడం వల్లే ఇలాంటి చక్కటి చిత్రాలు వస్తాయని అన్నారు.
అన్నపూర్ణ మాట్లాడుతూ…దర్శకుడు ఈ చిత్రకథ చెప్పగానే వెంటనే నటించాలనిపించింది. ఇందులో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథకు ప్రాధాన్యమిచ్చి తీసిన చిత్రమిది. నాకు మనవడుగా నటించిన మాస్టర్‌ రవితేజ ఎంతో ఈజ్‌తో నటించాడు అని అన్నారు.
 
దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ… పల్లెటూరి ప్రేమలను…వాతావరణాన్ని చూపే కథను ఎంచుకుని ఈ చిత్రాన్ని మలిచాం. నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బడ్జెట్‌ ఎక్కువైనా నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి ఎంతో సహకరించారు. సీనియర్‌ నటి జమునగారు అక్కినేని అనసూయమ్మ పాత్రలో ఆకట్టుకుంటారు అని అన్నారు.
 
నిర్మాత ఎమ్మెన్నార్‌ చౌదరి మాట్లాడుతూ…డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో..అందరి సహకారంతో చేసాం.చిత్రం చాలాబాగా వచ్చింది అని అన్నారు. ఈ వేడుకలో నటుడు బెనర్జీ, గాయని పసల బేబి, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్‌, నటుడు గోవిందరాజుల చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.