‘బిగ్‌బాస్‌’- 2’ హోస్ట్‌గా మరో స్టార్‌ హీరో

‘బిగ్‌బాస్‌’ ‘సీజన్‌-2’ లో కంటెస్టెంట్స్‌ ఎవరు? అసలు  హోస్ట్‌ ఎవరు ? అని బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.‘బిగ్‌బాస్‌’ షో  తెలుగులో  పెద్ద హిట్‌ అయింది. దీనికి హీరో యువ ఎన్టీయార్‌ హోస్ట్‌గా వ్యవహరించడం ఈ షోకి బాగా కలిసి వచ్చింది. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ అయిపోయింది. ఇప్పుడు  ‘బిగ్‌బాస్‌’- సీజన్‌ 2’కు కూడా తారక్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నారనీ, ఈ మేరకు లాంఛనంగా ‘స్టార్‌ -మా’ టీవీ ఛానెల్‌కు తారక్‌ ఓకే చెప్పారనీ వార్తలు వచ్చాయి. తాజా కబురు ఏమిటంటే… ‘బిగ్‌బాస్‌’- సీజన్‌ 2’కి హోస్ట్‌గా ఆయన చేయడం కుదిరేలా లేదు. ఆ విషయాన్ని షో నిర్వాహకులకు ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
 త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ మార్చిలో మొదలుకానుంది. ఆ సినిమాలో ఫిట్‌గా కనిపించడానికి బరువు తగ్గే ప్రయత్నాలు ఇప్పటికే  ఎన్టీఆర్‌ ప్రారంభించారు. ఆ చిత్రం తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా ప్రారంభం అవుతుంది. దీనికోసం కనీసం నెల రోజులు హోంవర్క్‌ చెయ్యాలని రాజమౌళి అడుగుతున్నారట.వరుసగా రెండు సినిమాలతో పాటు కుటుంబపరమైన కొన్ని కమిట్‌మెంట్స్‌ కూడా ఉండడంతో ‘బిగ్‌బాస్‌’- సీజన్‌ 2’కు తగిన సమయం కేటాయించడం కష్టమనే ఆలోచనకు తారక్‌ వచ్చారనీ, అందుకే షో నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారనీ భోగట్టా. ఈ నేపథ్యంలో, తారక్‌లా ఈ షోను రక్తికట్టించగల మరో స్టార్‌ హీరో కోసం ‘బిగ్‌బాస్‌’ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.