స్టార్ హీరోల ఆఫర్లతో నా పని తేలికయిపోయింది !

హీరోయిన్‌గా తన కెరీర్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది టాలీవుడ్‌లో దూసుకుపోతున్న లేటెస్ట్ భామ అను ఇమాన్యుయల్. అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్న సవాల్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందట. సరైన పాత్రలను ఎంచుకోవడం చాలా కష్టమైన విషయమని అంటోంది ఈ బ్యూటీ. “మజ్ను’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన తర్వాత సరైన రోల్స్‌ను ఎంచుకోవడం చాలా కష్టమైంది. అయితే అదృష్టవశాత్తు నా మొదటి సినిమా రిలీజ్‌కంటే ముందే నా చేతిలో కొన్ని తెలుగు సినిమాలున్నాయి. నేను చాలా లక్కీ. పైగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తుండడంతో నా పని ఇంకా తేలికయిపోయింది.

అయితే, తల్లిదండ్రులకు దూరంగా ఉండడం మాత్రం కష్టమైన విషయం. సుదీర్ఘ కాలం పాటు వారికి దూరంగా ఉండాల్సి రావడంతో మొదట్లో బాగా ఇబ్బందిగా ఉండేది. వారితో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నా.. తల్లిదండ్రులు దగ్గర లేరనే బాధ కలిగేది. ఇలాంటి సమయంలో నాకు నేను పని పెంచుకున్నా. మెల్లిమెల్లిగా ఇప్పుడు అలవాటయిపోయింది”అని చెప్పింది అను ఇమాన్యుయల్. ప్రస్తుతం ఈ మలయాళీ బ్యూటీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. ఆతర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాలో కూడా ఈ భామ అవకాశాన్ని దక్కించుకుంది.