చాలా విషయాలపైకి మనసు మళ్లుతుంటుంది!

అనుపమపరమేశ్వరన్‌ ‘ప్రేమమ్‌’ వంటి మలయాళ హిట్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్‌ భాషల్లోనూ అవకాశాలు వరించాయి.అయితే,అందులో విజయాలు బాగా తక్కువ. తెలుగులో మాత్రం అవకాశాలు వరుస కడుతున్నాయి.చాలా కాలం తరువాత తమిళంలో రెండో అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.
తెలుగులో నాని, నివేదాథామస్‌ కలిసి నటించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్‌ అవుతోంది. లక్కీగా ఇందులో నటి అనుపమపరమేశ్వరన్‌ నాయకిగా నటించే అవకాశం వరించింది. అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది.
 
ఈ చిత్రం గురించి అనుపమపరమేశ్వరన్‌ మాట్లాడుతూ… “ఈమధ్య తమిళంలో మంచి అవకాశం రాలేదని చెప్పింది. ఇన్నాళ్లకు ‘నిన్నుకోరి’ రీమేక్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని అంది. ఎందుకంటే.. ఇందులో కథానాయకి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. అయితే తెలుగులో నటి నివేదాథామస్‌ చాలా బాగా నటించిందని, ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదని అంది. తనదైన స్టైల్‌లో తాను నటించినట్లు తెలిపింది. ఇందులో తాను భరత నాట్య కళాకారిణిగా నటిస్తున్నట్లు చెప్పింది. క్లాసికల్‌ డాన్స్‌ను నేర్చుకున్న తనకు ఈ చిత్రంలోని పాత్ర ప్లస్‌ అవుతుందని భావిస్తున్నానని అంది. పాత్రలో ఎమోషనల్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని వాటిని అర్థం చేసుకుని నటిస్తున్నట్లు అనుపమా పరమేశ్వరన్‌ చెప్పింది.
 
ఒకే సమయంలో రెండు మూడు పనులు
‘‘తెరపై కనిపిస్తాను కాబట్టి సహజంగా నన్నంతా నటిగానే చూస్తుంటారు. కానీ నటన కాకుండా, ఇంకా చాలా కలలే కంటుంటా. వాటిని సాకారం చేసుకొనేందుకు కసరత్తులు కూడా చేస్తుంటా’’ అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ. ఇటీవల ‘రాక్షసుడు’తో తెలుగు ప్రేక్షకులముందుకొచ్చింది.
‘‘నటి కంటే ముందు, నేనొక నవతరం అమ్మాయిని. ఒక పనికో, ఒక వ్యాపకానికో పరిమితం కావడం మాకు ఇష్టం ఉండదు’’ అని అంటోంది అనుపమ. ‘‘ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడం ఇష్టం. చిన్ననాటి నుంచీ నాది అదే తీరు. చదువుకుంటూనే సినిమాల్లో నటించా. కానీ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. నటిగా కొనసాగుతున్నా ఇంకా చాలా విషయాలపైకి మనసు మళ్లుతుంటుంది.సెట్‌లో ఉన్నప్పుడు కూడా ఒక చోట కుదురుగా ఉండను. కెమెరా వెనకాల ఏం జరుగుతోంది, ఏ పని కోసం ఎవరెలా కష్ట పడుతున్నారో తెలుసుకుంటుంటా. ప్రస్తుతానికి నేను తరచూ కనే కల దర్శకత్వం గురించే. మిగిలిన కలలు గురించి తర్వాత చెబుతా’’ అని చెప్పింది అనుపమ