అందుకే వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోవడం లేదు !

మాది మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్‌ అవ్వాలన్న కోరిక కలలో కూడా వచ్చేది కాదు. ఓ రోజు మా స్నేహితురాలికి నివీన్‌ పౌలి (Nivin Pauly’ ) గారి నుంచి కాస్టింగ్‌ కాల్‌ వచ్చింది. నా స్నేహితురాలు  నా ఫోటోలు పంపింది. నా ఫోటోలు నచ్చి  పిలిచారు. అలా నా సినీరంగ ప్రవేశం జరిగింది…. అంటూ చెప్పింది తన చిత్రరంగ ప్రవేశం గురించి అనుపమ పరమేశ్వరన్ .
నా స్నేహితురాలు నా ఫోటోలు పంపిన విషయం నాకు కానీ ఆ కుటుంబానికి కానీ అస్సలు తెలియదు. ఓ రోజు మా ఫ్యామిలీ అందరం కూర్చుని భోజనం చేస్తుంటే ‘ప్రేమమ్‌’ యూనిట్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ ఫోటోలు బాగున్నాయి. అడిషన్‌కి రండి’ అని. ఆ కాల్‌తో నేనే కాదు… మా ఫ్యామిలీ కూడా షాక్‌కి గురైంది. మా ఫాదర్‌కి చాలా కోపం వచ్చింది. గతంలో ఎవ్వరూ మా ఫ్యామిలీ వాళ్ళెవ్వరూ సినిమాల్లో నటించలేదు. అసలు ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు ‘ఫోటోలు పంపిన విషయం మాకెందుకు చెప్పలేదంటూ’ మా ఫాదర్‌ కోప్పడ్డారు. ఓ రెండు రోజులు నాతో మాట్లాడలేదు కూడా. ‘ఫోటోలు నేను పంపలేదు. నా స్నేహితురాలు పంపింది అన్నా ఎవరూ నమ్మలేదు’. మా ఫ్రెండు మాత్రం ‘మంచి అవకాశం వచ్చింది వదులుకోవద్దు’ అంటూ నన్ను ఒప్పించి ఆడిషన్‌కి పంపించింది. అనుకోకుండా నేను సెలెక్ట్‌ కావడం, ఆ సినిమా చేయడం, దానిలో నా పాత్రకూ, నాకూ మంచి పేరు రావడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు కోప్పడిన మా ఫాదర్‌ ఇప్పుడు నాకు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తారు. కాకపోతే ‘బ్యాక్‌ టు బ్యాక్‌’ సినిమాలు చేయవద్దు. ఒక సినిమా పూర్తి అయిన తరువాతే మరొక సినిమా ఒప్పుకోవాలి. కుటుంబానికి కూడా టైం కేటాయించాలి’ …అని మా ఫాదర్‌ చెప్పారు. ఆయన మాట అంటే నాకు వేదంతో సమానం. అందుకే ఇప్పటి వరకూ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఒకటి పూర్తయిన తరువాతే మరొకటి చేస్తున్నాను.ప్రతి సినిమానీ కష్టపడే చేస్తాను. అనుకోకుండా వచ్చినా, నటనని సీరియస్‌గానే తీసుకున్నాను.
 
ఇక్కడ ఇల్లు కొనే ఉద్దేశం ఉంది !
మిగతా భాషలతో పోల్చుకుంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాల షూటింగ్‌ కూడా ఎక్కువగా హైదరాబాదులోనే ఉండడంతో నెలలో సగం రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ఇక ఇక్కడ సెటిల్‌ కావడం అంటే కొద్దిగా కష్టమే! మా ఫ్యామిలీకి ఇక్కడకు షిఫ్టు అయ్యే ఉద్దేశం లేదు. ఇక్కడకు వచ్చినప్పుడు హోటల్‌లో ఉండాల్సి వస్తోంది. ఇక్కడ ఇల్లు ఉంటే బాగుంటుంది అని ఈ మధ్యనే అనిపించింది. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇంటిని ఏర్పాటు చేసుకునే ఆలోచన లేదుకానీ, భవిష్యత్తులో ఇక్కడ ఇల్లు కొనే ఉద్దేశం ఉంది.