అప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలానే !

‘తయారు కావడం’ అనే కాన్సెప్ట్‌ ఏదైతే ఉందో… అది నా వల్ల కాదు.నేనందుకు విరుద్ధం’…అని అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. “కొందరికి క్రీమ్‌ రాసుకుని, పౌడర్‌ పూసుకుని, నచ్చిన కాస్ట్యూమ్స్‌ తెచ్చుకుని, వాటికి తగ్గ మ్యాచింగ్స్‌ని సెట్‌ చేసుకుని రెడీ అయిపోవడమంటే ఎంత ఇష్టమో. కానీ నేనందుకు విరుద్ధం. ఈ ‘తయారు కావడం’ అనే కాన్సెప్ట్‌ ఏదైతే ఉందో… అది నా వల్ల కాదు. అసలు నన్నెవరూ మార్చలేరు’’ అని అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ ఈ నెల్లోనే విడుదల కానుంది.
అనుపమ మాట్లాడుతూ… ‘‘నాకు షాపింగ్‌ అంటే ఇష్టం ఉండదు. డ్రస్సులు కొనడం కోసం పదుల షాప్‌లు తిరగడం నాకు నచ్చదు. నేను ఇన్నాళ్లు ఎలా ఉన్నానో, ఇప్పుడు కూడా అలాగే ఉండటానికి ఇష్టపడతాను. స్టార్‌డమ్‌ వచ్చిందని వెంటనే మారిపోవడం నాకు నచ్చదు. సింపుల్‌గా ఉండటాన్ని ఎంజాయ్‌ చేస్తాను. నా అభిమానులు, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ.. అందరూ నేను సింపుల్‌గా ఉండటాన్నే ఇష్టపడతారు’’ అని అంటోంది అనుపమ. ఆమెకు తన ఉంగరాల జుట్టంటే చాలా ఇష్టమట.
ఎప్పుడైనా ప్రేమలో పడిపోవొచ్చు
చిత్రసీమలో ప్రతిభావంతమైన కథానాయికలకు లోటు లేదు. తమ అందంతో, అభినయంతో ఆకట్టుకోవడానికి కథానాయికలంతా పోటీ పడుతున్నారు. వాళ్లలో అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఉంది. ప్రస్తుతం ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూ తగిన గుర్తింపు తెచ్చుకుంటోంది. మరి మీరెప్పుడు ప్రేమలో పడతారు?అని అడిగితే ‘‘ఎప్పుడు, ఎందుకు, ఎవరిపై ప్రేమ పుడుతుందో స్పష్టంగా చెప్పలేం. అదో కెమిస్ట్రీ అంతే. ఎలాగైనా మొదలైపోవచ్చు. ఎప్పుడైనా ప్రేమలో పడిపోవొచ్చు. ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతానన్నది ఇప్పుడే చెప్పలేను. అది పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. ఏవో లెక్కలేసుకుని, లాభ నష్టాలు బేరీజు వేసుకుని చేస్తే అది వ్యాపారం అవుతుంది. ప్రేమ ఎందుకు అవుతుంది? ప్రేమ విషయంలో ఇప్పటి వరకూ ఓ అభిప్రాయానికి రాలేకపోయాను. అది నన్నెప్పుడు పలకరిస్తుందో చూడాలి’’ అంటోంది అనుపమ.