చెయ్యలేకపోవడానికి కారణాలు బయటపెట్టలేను !

‘అ..ఆ’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చి ఇక్కడ అందరి ప్రశంసలను అందుకుంది అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ‘ప్రేమమ్’తో సినిమాల్లోకి అడుగుపెట్టి కేరళలో యూత్‌నుఅలరించింది. ‘శతమానం భవతి’ సినిమాతో ‘అచ్చ తెలుగు అమ్మాయి అంటే ఇలాగే ఉంటుంది’ అనిపించేంత అందంగా కనిపించింది. ఈ మూవీ బంపర్ హిట్ అయినా ఎందుకో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. గ్లామర్ హీరోయిన్‌గా క్లిక్ అవడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న అనుపమ అందం గురించి చెబుతూ…

“ఒళ్లంతా కనిపించేలా… ఒంపుసొంపులన్నీ ఆరబోసేలా కనిపిస్తేనే అందంగా ఉన్నట్టు కాదు. ఓ అమ్మాయి చీర కట్టుకున్నా, చుడీదార్ వేసుకున్నా, లంగా ఓణీలో అయినా గ్లామరస్‌గానే కనిపించవచ్చు. చివరగా అందమనేది చూసే కళ్లపైనే ఆధారపడి ఉంటుంది తప్ప డ్రెస్సింగ్‌పైన కాదు”అని పేర్కొంది. తెలుగులో మరో రెండు సినిమాలు చేయబోతున్నాను అని చెబుతున్న అనుపమ తెలుగు భాషలో మరింత పట్టు సాధిస్తానని నమ్మకంగా చెబుతోంది. ‘శతమానం భవతి’ చిత్రంలో  తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ఈ భామ… దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సతీష్ వేగేశ్నల దగ్గర ఎంతో నేర్చుకున్నానని చెప్పింది. వాళ్లిద్దరి సినిమాల్లో నటించడం తన అదృష్టమని అంటోంది. అయితే ‘శతమానం భవతి’ తర్వాత ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ల పక్కన నటించే అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఆమె చేజారిపోయాయి. “ఆ సినిమాలు ఎందుకు చెయ్యలేకపోయానో నేను కారణాలు బయటపెట్టలేను. బహుశా విధి అలా రాసిపెట్టి ఉండవచ్చు. లేదా ఆ అవకాశాలు మరోసారి రావచ్చు” అంటూ ఒకరకమైన వేదాంతం వల్లిస్తూ చెప్పింది అనుపమ.