మరో మహిళా దర్శకురాలు వచ్చేస్తోంది !

అనుపమ పరమేశ్వరన్‌ కు మాలీవుడ్, టాలీవుడ్, శాండల్‌వుడ్‌ల్లో అవకాశాలు బాగానే ఉన్నాయి. కాగా అనుపమ మాత్రం నటిగా అవకాశాలు వస్తున్నా…ఆమె ఆసక్తి మరో శాఖపైకి మళ్లుతోంది. ఆమె దృష్టి దర్శకత్వంపైకి మళ్లింది.’తాను మెగాఫోన్‌ పట్టే తీరుతాను’ అని నిర్ణయం తీసుకుందట. అంతే కాదు…అందులో మెళకువలు తెలుసుకునే ప్రయత్నంలో పడింది. సమయం దొరికినప్పుడల్లా దర్శకత్వ శాఖపై దృష్టి పెడుతున్న అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల నటిగా విరామం రావడంతో సహాయ దర్శకురాలిగా మారిపోయింది. మలయాళంలో నటుడు దుల్కర్‌ సల్మాన్‌ సొంతంగా నిర్మిస్తున్న చిత్రానికి సహాయ దర్శకురాలిగా మారిపోయిందట. అంతే కాదు త్వరలోనే దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటోందట.
 
అయితే ఇక అనుపమని నటిగా మరచిపోవాల్సిందేనా? అని చింతించనవసరం లేదట. దర్శకత్వం చేయాలన్నది తన కోరిక అని, అందుకే మెగాఫోన్‌ పట్టాలనుకుంటున్నానని, నటిగానూ కొనసాగుతానని అనుపమ పరమేశ్వరన్‌ చెప్పుకొచ్చింది. మొత్తం మీద మరో మహిళా దర్శకురాలు తయారవుతోందన్న మాట.ఇంతకీ ఈ అమ్మడు దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకొచ్చే ఆ నిర్మాత ఎవరో?
 
చిన్న తప్పు కూడా జరక్కూడదు
‘అదృష్టం కొద్దీ చిత్రసీమలో అడుగుపెట్టాను. ఎన్ని సినిమాలు చేస్తానో, ఎంత కాలం ఉంటానో తెలీదు. అందుకే ప్రతి సినిమానీ ఆస్వాదిస్తూ పనిచేయాలని నిర్ణయించుకున్నాను’ అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. సహజ సిద్ధమైన నటనకు అందం తోడైన కథానాయిక అనుపమ. కథానాయికల జాబితాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. తెలుగమ్మాయి కాకపోయినా భాషపై ప్రేమతో, సినిమాపై మక్కువతో తెలుగు నేర్చుకుని, తెలుగులోనే మాట్లాడుతోంది. సెట్లో మీరెలా ఉంటారు? సన్నివేశానికి ముందు చేసే కసరత్తులేంటి? అని అడిగితే.. ‘‘సెట్లో అడుగుపెట్టేటప్పుడు నా దృష్టంతా నేను చేయబోయే సన్నివేశంపైనే ఉంటుంది. స్క్రిప్టు పట్టుకుని ఓ పక్కకు వెళ్లిపోతాను. ఒక్కో డైలాగ్‌ని వేర్వేరు పద్ధతుల్లో ప్రాక్టీస్‌ చేస్తూ చదివేస్తుంటాను. ‘పరీక్షల ముందు కూడా ఇలానే చదివితే నీకు పెద్ద ఉద్యోగం వచ్చేది’ అని అమ్మ నన్ను ఆట పట్టిస్తుంటుంది. సెట్లో తడబడకూడదన్న తపన నాది. నా వల్ల చిన్న తప్పు కూడా జరక్కూడదు. చిన్న చిన్న కసరత్తులు చేయకపోతే మనం చేసే పనికి న్యాయం చేయలేం’’ అంది అనుపమ