అనుష్క థ్రిల్లర్‌ ‘భాగమతి’ సంక్రాంతి కి

గ్లామర్ నుంచి పర్‌ఫార్మెన్స్ రోల్ వరకు ఏ పాత్రలో అయినా అందం, అభినయం ఉండేలా చూసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న తార అనుష్క. హీరోయిన్‌లు కూడా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలరని ఆమె నిరూపించింది. ‘బాహుబలి’, ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీలకు ఆమె కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ తర్వాత అనుష్క నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ‘సైజ్ జీరో’ సినిమాతో భారీగా బరువు పెరగడంతో ఆమె ఎక్కువగా షూటింగ్‌లలో పాల్గొనడం లేదు.

ప్రస్తుతం ఈ టాప్ హీరోయిన్ చేతిలో ‘భాగమతి’ మూవీ ఒక్కటే ఉంది. అయితే తనకు వస్తున్న ఆఫర్లను ఆమె ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ‘భాగమతి’ మూవీని పూర్తి చేసే పనిలోఉంది అనుష్క. ఈ హిస్టారికల్ థ్రిల్లర్‌ను ‘పిల్ల జమీందార్’ దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. ముంబయ్‌లో ఆ పనులను దగ్గరుండి చేయిస్తున్నాడట దర్శకుడు. ఈ పనులన్నింటినీ పూర్తిచేసుకొని… త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి రిలీజ్ డేట్‌ను ప్రకటించే ఆలోచనలో ఫిల్మ్‌మేకర్స్ ఉన్నారు. ‘భాగమతి’ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వారు ప్లాన్ చేస్తున్నారు.