బరువు తెచ్చిన తంటా… ‘సాహో’ నుంచి ఔట్ !

ప్రభాస్‌ ‘సాహో’  నుంచి అనుష్కను తప్పించినట్టు  చిత్ర యూనిట్‌లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దానికి కారణం ఆమె బరువేనట.’బాహుబలి-2′ సినిమా తర్వాత ప్రభాస్ సుజీత్ రెడ్డి డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్ ఎంపికే చిత్ర యూనిట్‌కు చాలా కష్టంగా మారింది. అటొచ్చి..ఇటొచ్చి.. ప్రభాస్‌తో మూడు సార్లు జట్టు కట్టిన అనుష్కనే హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రమేశ్ బాలా అనే సినీ విశ్లేషకుడు ఇటీవలే వెల్లడించారు కూడా.

అయితే అనుష్కకు మింగుడు పడని పరిణామాలు ఎదురయ్యాయి. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ రిలీజయ్యాక అనుష్క.. ‘సైజ్ జీరో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం అనుష్క ఎంత బరువు పెరిగిందో కూడా చూసి ఉంటారు. ఆ తర్వాత ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్ కోసం కూడా ఆ బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడ్డారు అనుష్క. ఇప్పుడు ఆ బరువు తెచ్చిన తంటా ప్రభాస్ సాహో సినిమా నుంచి తనను తప్పించేదాకా తీసుకెళ్లింది.యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..

‘‘సాహోలోని ఆమె పాత్ర కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. అయితే.. ఆమె బరువు తగ్గడం తలకు మించిన భారంగా మారిపోయింది. ఎన్నెన్నో వర్కవుట్లు చేసినా.. ఇంకా కావాల్సిన బరువుకు 5 నుంచి 8 కిలోలు ఎక్కువగానే అనుష్క ఉన్నారు. అదే సినిమాలో ఆమె ఆఫర్‌కు గండి కొట్టింది’’ అని చెబుతున్నారు.

కాగా, సాహోలో పాత్ర కోసం అనుష్క చాలా వర్కవుట్లు చేస్తున్నారు. అందుకే ‘సైమా అవార్డ్స్’ ఫంక్షన్‌కు కూడా ఆమె వెళ్లలేదని సమాచారం. ఇక,ఎనిమిది కిలోలు ఎక్కువగా బరువు ఉన్నారన్న నెపంతో అనుష్కను సినిమా నుంచి తీసేయడం.. సాహో సినిమాలో కొత్త హీరోయిన్ కు దారి తీసింది.