బరువు తగ్గాలని సీరియస్‌ వర్కవుట్లు !

తన బరువు తగ్గించుకొనే పనిలో  స్వీటీ అనుష్క ఇప్పుడు బిజీగా ఉంది. 20 కిలోలు తగ్గాలనే లక్ష్యంతో ముంబాయి నుంచి ప్రత్యేకంగా ట్రైనర్‌ని పిలిపించుకొని వర్కవుట్లు చేస్తోంది. జూబ్లీ హిల్స్‌లోని తన ఇల్లు, జిమ్‌ తప్ప మరో చోటికి ఆమె వెళ్లడం లేదు. రోజుకి ఎనిమిది గంటలు జిమ్‌లోనే అనుష్క గడుపుతోందంటే ఆమె ఎంత సీరియస్‌గా వర్కవుట్లు చేస్తోందో ఊహించుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారట.
సినిమాల్లో ఆయా పాత్రలను బట్టి అనుష్క వేషధారణ ఉంటుంది. కానీ నిజ జీవితంలో అత్యంత సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడుతారు ఆమె. ఆడియో వేడుకల్లోనూ, ఇతరత్రా ఇంటర్వ్యూలు ఇచ్చే సందర్భాల్లోనూ ఆమెలోని నిరాడంబరత కనిపిస్తూనే ఉంటుంది. అంత సింపుల్‌గా ఉండే మగువ తెరమీద అన్ని నగలు వేసుకుని ఎలా నటించగలుగుతున్నారు? ఈ విషయాన్ని అనుష్క ముందు ఉంచితే.. ‘‘అన్నేసి నగలు పెట్టుకుని నటించాలంటే మొదట్లో నాకు కాస్త అసౌకర్యంగా అనిపించిన మాట వాస్తవమే. కానీ ‘అరుంధతి’లో జేజమ్మ పాత్రకోసం తొలిసారి చాలా నగలు వేసుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా కొన్ని రకాల నగలను ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియదు. అంటే నగల మీద నాకు ఎంత అనాసక్తత ఉండేదో అర్థం చేసుకోండి. కానీ ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి ది కంక్లూజన్‌’ చేశాక ఎన్ని రకాల నగలు వేసుకున్నప్పటికీ, నేను నటన మీద దృష్టి పెట్టగలుగుతున్నాను. చాలా రకాల నగల పేర్లు కూడా నాకు తెలుస్తున్నాయి. పలువురు మహిళలు కూడా నగల గురించి నాతో ప్రస్తావిస్తున్నారు. ఎక్కడికో ఎందుకు..? నా ఒంటి నిండా నగలు చూసి మా ఇంట్లో మా అమ్మ ఆనందాన్ని పట్టడానికి పగ్గాల్లేవంటే నమ్మండి’’ అని చెప్పారు స్వీటీ.