‘సవాల్’ అంటే ఎలా ఉంటుందో అర్ధమైంది !

“సవాల్ అంటే ఎలా ఉంటుందో అర్ధమైంది. అదే ఈ పాత్ర చేసేలా చేసింది”… అని అంటోంది అనుష్క శర్మ.  షారుఖ్‌ ఖాన్‌ హీరోగా రూపొందిన ‘జీరో’ చిత్రంలో అనుష్క శర్మ పక్షవాతంతో బాధపడుతున్న యువతి పాత్రలో నటించింది. ఆనంద్‌ ఎల్‌ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.
”ఆక్యూపేషనల్‌ థెరపిస్టు, ఆడియోలాజిస్టు లకు దగ్గరగా మూడు నెలలు పాటు పని చేశాను. ఆఫియాగా ఈ మూడు నెలలు వీల్‌ఛైర్‌పైనే ఉన్నా. ఆ పాత్రను అంతలా ప్రేమించా” అని బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ అన్నారు. ఆఫియా పాత్ర కోసం ఇద్దరు ప్రొఫెషనల్‌ ట్రైనర్స్‌ శిక్షణ ఇచ్చారని, ఓ సైంటిస్టు, పక్షవాతానికి గురైన వారితో ఎక్కువగా గడిపానని చెప్పారు. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు ప్రత్యేకంగా పద్ధతిలో ప్రిపేర్‌ అయినట్టు తెలిపింది. ”ఈ పాత్ర పోషిస్తున్నప్పుడు సవాల్ అంటే ఎలా ఉంటుందో అర్ధమైంది. అదే ఈ పాత్ర చేసేలా చేసింది. ఈ పాత్ర చేయగలను అనుకుంటేనే కదా ఏదైనా ఆశించొచ్చు. అందుకే పాత్రకు తగిన విధంగా చేయాలనుకున్నా. ఈ క్యారెక్టర్‌ చేయమని ఆనంద్‌ సర్‌, రచయిత ఇమాన్షు శర్మ నా దగ్గరకు వచ్చేటప్పటికే వైద్యులతో చాలా పరిశోధన చేశారు. ఈ పాత్ర నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ క్యారెక్టర్‌ గురించి క్లుప్తంగా వివరించినప్పుడే నాకు అర్ధమైంది. అదే సమయంలో వైద్యులను కూడా కలిశాను” అని చెప్పింది అనుష్క.
 
ఎలా ఉండాలి?. శారీర అవయవాలు కదలికల పరిధులు, మాట్లాడేటప్పుడు తన కండీషన్‌పై పడే ప్రభావం వంటి విషయంలో ఆక్యూపేషనల్‌ థెరపిస్టు, ఆడియోలాజిస్టు ఎంతో సాయం అందించారన్నారు. ”ఈ పాత్ర కోసం నేను సృష్టించినవే చేయడం కష్టమైంది. డైలాగులు, భావోద్వేభరితమైన సన్నివేశాలు వచ్చినప్పుడు కష్టంగా ఉండేది. అందుకే తరచూ వాటిపై దృష్టి సారించేదాన్ని. పాత్ర పెర్‌ఫెక్ట్‌గా రావడం కోసం అదనంగా టేక్స్‌ తీసుకునేదాన్ని. బాగుందనేదాకా ఎక్స్‌ట్రా టేక్స్‌ తీసుకునేదాన్ని. సన్నివేశం బాగా అర్ధమయ్యాకే షాట్‌కు ఓకే చెప్పాదాన్ని. ఈ చిత్రంలో నా పాత్రను మూడు నెలలు పాటు షూట్‌ చేశారు. ఈ షూటింగ్‌ సమయం అంతా వీర్‌చైర్‌పైనే ఉన్నా. ఓ దశలో వీల్‌చైర్‌కే పరిమితం కావడంతో జీవితాంతం ఇలాగే ఉంటాను అని అనిపించేసింది. ఈ పాత్ర కోసం నేను చేసిన మూడు నెలలు ప్రాక్టీస్‌ షూటింగ్‌ బాగా ఉపయోగపడింది’ అని చెప్పింది అనుష్క శర్మ.
ప్రతిభ ఉంటే జడ్జ్‌మెంట్‌ని సైతం మార్చగలం !
‘ప్రతిభ లేకుండా స్టార్‌డమ్‌ రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చినా అది ఎక్కువ రోజులు నిలబడదు’ అని అంటోంది అనుష్క శర్మ. విభిన్న కథా చిత్రాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా అనుష్క బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకున్నారు. ‘బ్యాండ్ బాజా బారాత్‌’, ‘జబ్‌ తక్‌ హై జాన్‌’, ‘పీకే’, ‘ఎన్‌హెచ్‌ 10’, ‘సుల్తాన్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన అనుష్క నటించిన తాజా చిత్రం ‘జీరో’ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా స్టార్‌డమ్‌ గురించి అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెబుతూ… ‘నేను నటించిన మొదటి సినిమాకి, నాకు గుర్తింపు రాలేదు. నా నటనకు ప్రశంసలు అంతగా రాలేదు. నిజం చెప్పాలంటే ‘బ్యాండ్‌ బాజా బారాత్‌’ సినిమా కోసం ఆడిషన్‌ నిర్వహించినప్పుడు కరణ్‌ జోహార్‌కి నా నటన అస్సలు నచ్చలేదు. కానీ అంతకు ముందు నేను నటించిన సినిమాలు చూసి, తన అభిప్రాయాన్ని మార్చుకుని చివరకు నన్ను ఎంపిక చేశారు. మనలో నిజంగానే ప్రతిభ ఉంటే జడ్జ్‌మెంట్‌ని సైతం మార్చగలమని అర్థమయ్యింది. అది మనకు ఎంతో హెల్ప్‌ చేస్తుంది. కెరీర్‌ ప్రారంభంలో అతిగా ప్రశంసలు వస్తే, అది మన పతనానికి దారి తీస్తుంది. మనలో బెటర్‌మెంట్‌ రావడానికి స్కోప్‌ ఉండదు. అందుకే ప్రతిభ ఉంటేనే నిజమైన స్టార్‌డమ్‌ సాధ్యమవుతుంది’ అని తెలిపింది.