నేను చేసే పాత్రలన్నీ అసాధారణమైనవే !

“నేను ఎంపిక చేసుకునే పాత్రలన్నీ అసాధారణమైనవే.నేను ఏ పాత్ర చేసినా అది నేను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో ఉండదు”..అని ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతోంది నటి అనుష్క శర్మ. ఆమె ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 
అనుష్క శర్మ సినీ ఇండిస్టీలోకి అడుగుపెట్టి పదేళ్ళు అవుతోంది. ఈ దశాబ్దకాలంలో చాలా వెరైటీ పాత్రల్లో నటించింది. షారుఖ్‌ హీరోగా చేసిన ‘రాబ్‌ నే బనా డి జోడీ’ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఖాతాలో చాలా హిట్‌ సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఎన్‌హెచ్‌ 10’, ‘పీకే’, ‘ఫిలౌరి’, ‘సుయీ ధాగ’ వంటి చిత్రాలు ఈమెచేసిన అత్యుత్తమమైనవిగా చెప్పవచ్చు. పదేళ్ల క్రితం ఆమె ఏ హీరోతో అయితే ఎంట్రీ ఇచ్చిందో.. ఇప్పుడు అదే కథానాయకుడు షారుఖ్‌తో  ‘జీరో’లో మరోసారి చెయ్యబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ…
‘సుయీ ధాగ’ విజయం తర్వాత కొత్తగా ఉండే, విభిన్నమైన పాత్రల్లో నటించాలని ఉందని పేర్కొంది అనుష్క శర్మ. ‘నేను ఎంపిక చేసుకునే పాత్రలన్నీ అసాధారణమైనవి. ఆ పాత్రల ప్రభావం నాపై కూడా పడింది. నేను చేసే ప్రతి సినిమాలోనూ డిఫరెంట్‌గా ఉండాలని నాకు నేను అనుకుంటా. అటువంటి పాత్రలు చేసేందుకే ప్రయత్నిస్తాను కూడా. నేను ఏ పాత్ర చేసినా అది నేను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో ఉండదు. ‘సుయీ ధాగ’ తరహాలోనే అన్నీ ఉంటాయి. ఎవ్వరూ చేయని పాత్రే చేయాలనుకుంటా’ అని తెలిపింది అనుష్క.
 
కెరీర్‌ ప్రారంభంలో ఎవరైనా సక్సెస్‌ కోసమే తపిస్తారని తాను అలాగే చేశానని చెప్పింది. కానీ తన పాత్రల ఎంపికలో మాత్రం వాటి ప్రభావం పడలేదు. నేను నమ్మినదే చేశాను. అర్ధంపర్దం లేని పాత్రలు మాత్రం నేనెప్పుడూ చేయలేదని అన్నది. తనకు 19-20 ఏళ్ల వయసులోనే పాత్రల ఎంపిక ఎలా అన్నవిషయంలో పూర్తి స్పష్టత వచ్చేసిందని తెలిపింది. వివిధ స్థాయిల్లోని ప్రజలు మాట్లాడుకునేటట్టు ఉండే సినిమాలు చేయాలనుంది’ అని వెల్లడించింది.
 
షారుఖ్‌ ఖాన్‌తో పని చేయడంపై ఎలా అనిపిస్తుందన్న దానికి అనుష్క సమాధానం ఇస్తూ…’ షారుఖ్‌ ఖాన్‌ సహృదయం కలిగిన వ్యక్తి. ఆయనతో నేను చేసిన తొలి సినిమా అయినా.. చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. ఆయన నిత్యం మనకి స్వాగతం పలుకుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. చాలా విషయాల్లో ఆయనకు విపరీతమైన పరిజ్ఞానం ఉంది. పనిపై అతని ప్యాషన్‌ ‘జీరో’ సినిమా సెట్స్‌పై చూశాను. ఈ సినిమాలో అతను ఏదో అద్భుతం చేయబోతున్నారనుకుంటున్నా. గొప్పగానటించారు” అని వెల్లడించింది అనుష్క.