కొన్నాళ్లుగా నా ఇష్టాలేవీ చెల్లుబాటు కావడం లేదు!

“హర్రర్ సినిమాలకు నేనే మంచి ఛాయిస్” అని అందరూ అనుకుంటుంటారు. నిజానికి ఆ సినిమాలంటే నాకు చాలా భయం…అని అంటోంది అనుష్క. “నాకు సీరియస్ గా సాగే సినిమాలు, ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. జాలీజాలీగా సాగిపోయే సినిమాలంటే ఇష్టం. అలాంటి సినిమాలు చేసేటప్పుడు పెద్దగా టెన్షన్ కూడా ఉండదు. ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నా ఇష్టాలేవీ చెల్లుబాటు కావడం లేదు. సీరియస్ పాత్రలు, లేకపోతే లేడీ ఒరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాను”…అని చెప్పింది అనుష్క.
 
‘సూపర్’ సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమై విక్రమార్కుడు, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, వేదం, భాగమతి, పంచాక్షరిలాంటి పవర్‌ఫుల్ కేరక్టర్స్‌తో అభిమానులను మెప్పించింది అనుష్కశెట్టి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
టాలీవుడ్ అంటే చాలా ఇష్టం!
సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనిపించలేదు. ‘సూపర్’ సినిమాకి ముందు ఎలాంటి ఆడిషన్‌కీ వెళ్లలేదు కూడా. అనుకోకుండా ఆ సినిమాలో అవకాశం వచ్చింది. సరదాగా చేద్దామనే చేసాను. ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలేవీ నాకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ సమయంలో మాత్రం వెనుతిరిగి వెళ్ళిపోదామా అనిపించింది. ఆ సమయంలో ‘విక్రమార్కుడు’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ‘ఆ సినిమా సక్సెస్ తర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవసరం కలగలేదు.టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వాళ్లంతా స్నేహపూర్వకంగా ఉంటారు. అభిమానుల ఆదరణ చెప్పనక్కర్లేదు. సినిమా కోసం రిస్కులు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బరువు విషయంలో ఇబ్బందులు పడ్డాను.
 
ఆందోళ పెంచుకోవడం ఎందుకు?
సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. నాకు చాలా తక్కువ సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని సోషల్ మీడియాలో గడపడం ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే నాకు పేపర్లు చదవడం కూడా ఇష్టం ఉండదు. అందులో బోలెడన్ని టెన్షన్ పడే వార్తలుంటాయి. నాకున్న టెన్షన్లకి తోడు వార్తలు చదివి ఆందోళ పెంచుకోవడం ఎందుకు? నాకు ఎంతవరకూ అవసరమో అంతవరకు మాత్రమే వార్తలు తెలుసుకుంటాను.
 
అవార్డు రావడం కన్నా అభిమానుల ఆదరణే ముఖ్యంకదా! ‘బాహుబలి’ సినిమా రాకముందు దక్షిణాది ప్రేక్షకులకు మాత్రమే నేను తెలుసు. ఇప్పుడు దేశంలోని సినిమా ప్రేక్షకులందరికీ నేను పరిచయమయ్యాను.
 
నేనెందుకు మానుకోవాలి?
మా ఇంట్లో తప్ప నాకు ఎకడా కంఫర్ట్‌గా ఉండదు. ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే ఇంట్లో వాలిపోతాను.’అబద్ధాలకి బాధపడాల్సిన పని లేద’ని మా ఫ్యామిలీ ఎప్పుడూ అంటూ ఉంటుంది. ఏ హీరోతో నేను సినిమా చేస్తే ఆ హీరో మీదా, నా మీద రూమర్లు వస్తూనే ఉంటాయి. మొదట్లో ఇలా ఎందుకు వస్తున్నాయి? అని కొద్దిగా బాధపడిన మాట వాస్తమే. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేసాను.
 
పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్లు సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా? నేను ఎందుకు మానుకోవాలి? నేను సినిమా ఒప్పుకోక పోవడానికి కారణం వేరే ఉంది. ఇప్పటి వరకూ అన్నీ బరువైన పాత్రలే చేస్తూ వచ్చాను. సరదాగా సాగే పాత్ర చేయాలని ఉంది. ప్రస్తుతానికి పెళ్ళి ఆలోచన లేదు. నిజంగా నా పెళ్ళి సెటిల్ అయితే నా అభిమానులను మించిన ఆత్మీయులు నాకు ఎవరుంటారు? ముందుగా వారికే చెబుతాను.