“హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు” అనుష్క ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.దక్షిణాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటి అనుష్క. ఇప్పుడు ఆమెకీ ఆశ పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే.. అనుష్క తమిళం కంటే తెలుగు చిత్రాలనే ఎక్కువగా నమ్ముకుంది. అనుష్కకు ఒక స్థాయి తీసుకొచ్చిందీ తెలుగు చిత్ర పరిశ్రమనే. కోలీవుడ్‌లో ‘సింగం’ చిత్రంతో విజయానందాన్నిపొందింది. ఈమె లోని అభినయాన్ని బయటకు తీసింది టాలీవుడ్. ‘అరుంధతి’ చిత్రాన్ని, అందులోని అనుష్క నటనను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి నటి ‘భాగమతి’ చిత్రం తరువాత రెండేళ్లు ముఖానికి రంగేసుకోలేదు.’సైజ్ జీరో’ చిత్రంలోని పాత్ర కోసం పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఇప్పుడిప్పుడే గత అందాలను సంతరించుకున్న అనుష్క తాజాగా ‘సైలెన్స్’ అనే సైంటిఫిక్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఈ బ్యూటీ చిరంజీవి నటిస్తున్న చారిత్రక కథా చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి లో ఒక కీలక పాత్రలో చేసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ చివరి రోజునే అనుష్క గాయాలపాలైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమెను వైద్యులు రెండు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తింది. ‘సైలెన్స్’ చిత్ర షూటింగ్ కోసం అమెరికాలో ఉండడంతో తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే.. ఇంకా రచ్చ చేస్తారనుకుని తాను బాగానే ఉన్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఇక, అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘సైలెన్స్’ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు అంటూ నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. నటుడు మాధవన్ హీరోగా నటిస్తున్న ఇందులో నటి అంజలి, శాలినిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అనుష్క ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే చెయ్యాలని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు తాను దక్షిణాది చిత్రాలతోనే సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. ఇప్పుడు ఆమె ఏకంగా హాలీవుడ్ పైనే ఆశ వ్యక్తం చేయడం విశేషం. బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకచోప్రా, దీపికా పదుకొనే వంటి వారు హాలీవుడ్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకోవడం.. తాజాగా నటి శ్రుతిహాసన్ కూడా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని సంపాయించుకోవడంతో అనుష్కకూ హాలీవుడ్ ఆశ పుట్టి ఉండవచ్చునంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుడు ‘సైలెన్స్’ చిత్రంతో తొలిసారిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతోంది కాబట్టి.. తదుపరి హాలీవుడ్‌పై గురి పెట్టాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చునని కామెంట్స్ చేస్తున్నారు