ఇంట్లోనుండి పారిపోయి కష్టాలపాలయ్యిందట !

సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన చిన్నసినిమా ‘అర్జున్ రెడ్డి’  ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం గా  మారింది. సినిమాలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ షాలినీపాండేల నటన ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.ఇదిలాఉంచితే… ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీపాండే ఈ సినిమా చేయకముందు అనుభవించిన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వస్తున్న పలు కథనాలు ఆసక్తిరేపుతున్నాయి….
మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షాలిని పాండే చదువుకునే రోజుల్లోనుండే సినిమా రంగంలోకి రావాలని కలలు కంటూ ‘థియేటర్ ఆర్ట్స్‌’లో శిక్షణ కూడా పొందిందట. కానీ సినిమాల్లోకి రావడానికి తండ్రి విభేదించడంతో ఇంట్లోనుండి పారిపోయి చాలా కష్టాలు అనుభవించిందట. షాలిని తండ్రి ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఓ దశలో తండ్రిపై పోలీస్ కేసు పెట్టడానికి కూడా సిద్ధపడిందట షాలిని. దీంతో ఇక ఎప్పుడుకూడా ఇంటి గడప తొక్కొద్దని వార్నింగ్ ఇవ్వడంతో ఓ చిన్న గదిలో ఉంటూ దుర్భరజీవితం గడిపిందని సమాచారం. డబ్బులు తక్కువగా ఉండటంతో ఒక్కోసారి పస్తులుండటం, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్లి రావడం లాంటి కష్టాలెన్నో ఎదుర్కొందట. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆఫర్ వచ్చాక సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్నిరోజుల సమయం ఉండటంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆ గదిలోనే ఉంటూ నరకం అనుభవించిందట షాలిని.ఎలాగోలా కష్టాలనుదాటి కొందరు స్నేహితుల సహకారంతో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అవకాశం సంపాదించిన ఈమె తొలి ప్రయత్నంలోనే తనను విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటుండటం విశేషం.