ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ప్రముఖ నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయనిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయనిర్మల.
ఏడో ఏటనే సినీరంగ ప్రవేశం..
విజయనిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయనిర్మలగా పేరు మార్చుకున్నారు. అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదొక్కుకొని ఉండడం కూడా ఓ కారణం. ప్రముఖ నటుడు నరేశ్‌ విజయనిర్మల కుమారుడు. నటి జయసుధకు ఈమె పిన్ని. 1950లో ‘మత్య్సరేఖ’ అనే తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు. అక్కడి నుంచి సుమారు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు. పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ తదితర చిత్రాల్లో నటించారు. ‘పెళ్లి కానుక’ సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు. ఏడేళ్ల వయస్సులోనే ఆమె సోదరి రావు బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా ఆమె కెమెరా ముందుకు వచ్చారు. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్రపరిశ్రమలో విజయ నిర్మల అడుగుపెట్టింది. కృష్ణుడి వేషంలో ఉన్న విజయనిర్మలకు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ ఆమెకు దిష్టి తీశారు.
దర్శకురాలిగా గిన్నిస్‌బుక్‌లో..
ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె ‘మీనా’ అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు.
హీరోయిన్‌గా నటించిన తన తొలి చిత్రం ‘రంగులరాట్నం’కి నంది పురస్కారం అందుకున్నారు. సినీ రంగంలో ఇచ్చే ఉన్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఆమె అందుకున్నారు.
నిజ జీవితంలోనూ భార్యభర్తలు
తెలుగు చిత్రపరిశ్రమలోని జంటలో కృష్ణ-విజయ నిర్మల చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరూ ప్రముఖ నటులే. ఎన్నో విజయవంతమైన, చరిత్ర సృష్టించిన సినిమాల్లో నటించారు. ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీగా నటించిన వీరు ఆ తర్వాత పలు చిత్రాల్లో కలిసి నటించారు. చివరికి నిజ జీవితంలోనూ భార్యభర్తలు అయ్యారు. విజయ నిర్మల తొలిసారి కృష్ణను చూసింది ఆమె కథానాయికగా పరిచయమైన ‘రంగులరాట్నం’ సెట్‌లోనే. ఆ సినిమా దర్శకుడితో మాట్లాడటానికి కృష్ణ వస్తుండేవారు. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’లో ఇద్దరూ తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటన వారిద్దరినీ నిజ జీవితంలోనూ అగ్ని ‘సాక్షి’గా ఒక్కటయ్యేలా చేసింది.
 
1967లో వచ్చిన ‘సాక్షి’ బాపు తొలి చిత్రం. ఈ సినిమా షూటింగ్‌ కోసం 30రోజులు అవుట్‌డోర్‌ ప్లాన్‌ చేశారు. గోదావరి తీరంలోని పులిదిండిలో గ్రామంలో చిత్రీకరించాలనుకున్నారు‌. ఆ ఊళ్లో ఓ గుడి ఉంది. అందులో కృష్ణుడికి మీసాలు ఉంటాయి. అందుకే భక్తులు ఆయనను మీసాల కృష్ణుడు అంటారు. ఆ దేవుడు మహిమాన్వితుడని అక్కడివారి నమ్మకం. ‘సాక్షి’లో నటించిన హాస్య నటుడు రాజబాబుకి కూడా మీసాల కృష్ణుడి మహత్తు తెలుసు. ఆ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు. ఆరుద్ర రాసిన ‘అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగా… బతకరా పచ్చగా పచ్చగా…’ అనే పాట కోసం కృష్ణ, విజయ నిర్మలను పెళ్లి దుస్తుల్లో అలంకరించి, వారి కొంగులు ముడివేసి ఆ గుడిలోనే చిత్రీకరించారు. అప్పుడు అక్కడే ఉన్న రాజబాబు కొత్త దంపతుల దుస్తుల్లో ఉన్న వారిద్దరినీ చూస్తూ ‘ఇక్కడి మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్‌‌’ అంటూ ఛలోక్తి విసిరారు. ఆయన మాటే నిజమయింది. ఇది జరిగిన రెండేళ్లకే కృష్ణ, విజయ నిర్మల నిజజీవితంలో ఒక్కటయ్యారు.
రికార్డు సృష్టించిన జంట 
ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో-హీరోయిన్‌ కలిసి నటించిన చిత్రం విజయం సాధించిందంటే, దర్శక-నిర్మాతలు మళ్లీ అదే జోడీతో సినిమా తీయడానికి ఆసక్తి చూపుతారు. ప్రేక్షకుల సైతం ఆ హిట్‌ పెయిర్‌ మళ్లీ, మళ్లీ రిపీట్‌ కావాలని అనుకుంటారు. అలా ఇప్పటివరకూ చాలామంది నాయకనాయికలు వెండితెరపై సందడి చేశారు. అలాంటి వారిలో కృష్ణ-విజయ నిర్మల ఒకరు.
 
వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. బాపు దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డు. ఇంతవరకూ ఏ జోడీ కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు. వీటిల్లో ‘టక్కరి దొంగ చక్కని చుక్క’, ‘విచిత్ర కుటుంబం’, ‘బందిపోటు భీమన్న’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘దేవదాసు’, ‘పాడిపంటలు’, ‘శ్రావణమాసం’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.