‘అవెంజర్స్‌’ స్టార్స్ కు భారీగానే ముట్టింది !

హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న సిరీస్‌లలో ‘అవెంజర్స్’ మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన చివరి చిత్రం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.2 బిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ‘అవెంజర్స్‌’లో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులు అందుకున్న పారితోషిక వివరాలు వెల్లడయ్యాయి. వారిలో అత్యధిక పారితోషికం తీసుకున్నది ‘ఐరన్‌ మ్యాన్‌’ రాబర్ట్‌ డౌనీ జూనియర్‌. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’ వసూళ్ల నుంచి వచ్చే మొత్తంలో వాటా కావాలని డౌనీ ముందుగానే మార్వెల్‌ సంస్థ అధినేత కెవిన్‌ ఫీజ్‌తో ఒప్పందం చేసుకున్నారట. ‘ఎండ్‌గేమ్’ సినిమాకు ముందు వచ్చిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ సినిమా కోసం డౌనీ తీసుకున్న పారితోషికం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ సినిమాకు గానూ డౌనీ 75 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.521 కోట్లు పారితోషికంగా తీసుకున్నారు. ఆయన నటించిన ‘ఐరన్‌ మ్యాన్’ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకోవడంతో డౌనీ మార్కెట్‌ విలువ తారాస్థాయికి చేరింది.
 
ఇక ‘అవెంజర్స్‌’లో థార్‌ పాత్రలో నటించిన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ఈ సిరీస్‌ నుంచి ఐదు సినిమాలకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ డీల్‌ నుంచి హెమ్స్‌వర్త్‌కు ముట్టిన మొత్తం 15 మిలియన్‌ డాలర్ల నుంచి 20 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. కెప్టెన్‌ అమెరికా పాత్రలో నటించిన క్రిస్‌ ఇవాన్స్‌ కూడా దాదాపు 20 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారు. బ్లాక్‌ విడో పాత్రలో నటించిన స్కార్లెట్‌ జొహాన్సన్‌ కూడా దాదాపు 20 మిలియన్‌ డాలర్లు తీసుకున్నారు.
మిగతా పాత్రల్లో నటించిన ఎలిజబెత్‌ ఓల్సెన్‌, ఆంటోనీ మ్యాకీ, సెబాస్టియన్‌ స్లాన్‌, జెరెమీ రెన్నర్‌ మార్వెల్‌ స్టూడియోస్‌తో మున్ముందు చేయబోయే ప్రాజెక్ట్‌ల కోసం ప్రత్యేకంగా ఓ డీల్‌ను కుదుర్చుకున్నారు.