స్వాతంత్రదినోత్సవ కానుకగా ప్రభాస్ ‘సాహో’ ?

‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తరువాతి చిత్రం ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి క్రేజ్ తో ప్రభాస్‌కు ఇంటర్నెషనల్ స్థాయిలో మార్కెట్‌ ఏర్పడింది. దాంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ మేకింగ్‌ వీడియోకు మంచి స్పందన రావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

ఈ చిత్రం వేసవిలో వస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం వేసవిలో రావడం లేదని తెలిసింది. ‘సాహో’ చిత్రం విడుదల తేదీలో మార్పు చేస్తున్నారట. మొదట ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో  రిలీజ్ చేయాలనుకున్న మాట వాస్తవమే.  కానీ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్, సమ్మర్ సీజన్ పోటీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మూడు నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిల్మ్‌మేకర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. ఇక గత ఏడాదిన్నర కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అన్ని ఏరియాల్లో కూడా మంచి ప్రమోషన్ చేసి పెద్ద బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారట. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో‘లో డార్లింగ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఎసాన్-లాయ్ బాణీలు అందిస్తున్నారు.మరోవైపు ప్రభాస్, రాధాకృష్ణల కాంబినేషన్‌లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది.