యూనివర్శల్‌ అప్పీల్‌ ఉండేలా చూసుకుంటా !

హీరోలకు తక్కువ టైమే ఉంటుంది కెరీర్‌ పరంగా!… మళ్లీ ఇప్పుడు మరో సినిమాకు ఐదేళ్ళు  ఇవ్వలేను. నా కెరీర్‌కు అదంత మంచిది కాదు. ఒకవేళ ఐదేళ్లు ఇచ్చినా… దాంతో పాటు వేరే సినిమాలు కూడా చేస్తా. ఎందుకంటే… వయసునూ దృష్టిలో పెట్టుకోవాలి కదా!…. అని అంటున్నాడు ‘సాహో’ ప్రభాస్ ఒక ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో….

  •  ‘బాహుబలి’ వంటి ఛాన్స్‌ లైఫ్‌లో ఒక్కసారే వస్తుంది. అదెంత భారీ చిత్రమో తెలిసే చేశా. ‘బాహుబలి’ విజయంపై నా కెరీర్‌ను నిర్మించుకోవాలనుకుంటున్నా. ఇకపై చేసే సినిమాల్లో యూనివర్శల్‌ అప్పీల్‌ ఉండేలా చూసుకుంటా. ప్రాంతీయ చిత్రాలు, కథలు వేరు. దేశవ్యాప్తంగా ఉన్న నా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కథలు ఎంపిక చేసుకుంటున్నా. ప్రేక్షకులందరికీ నచ్చే కథలే చేస్తా.
  •  హిందీ చిత్రాలు చేయాలనే ఆసక్తి నాలోనూ ఉంది. ఒక్క హిందీలోనే కాదు… పంజాబీ సహ దేశంలో ఎక్కడైనా, ఏ భాషలోనైనా చిత్రాలు చేస్తా. మంచి కథ కుదరాలంతే. ప్రాంతం, భాష… నాకు పెద్ద సమస్యే కాదు. నా చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటా. అంటే… కామెడీ అని కాదు. సంథింగ్‌ డిఫరెంట్‌గా, గ్రిప్పింగ్‌గా ఉండాలి. హిందీ నుంచి చాలా అవకాశాలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితమే అక్కడ ఓ ప్రేమకథను అంగీకరించా. ‘సాహో’ తర్వాత ఆ కథలో నటిస్తా.
  •  హిందీలో డబ్బింగ్‌ చెప్పుకోవడం నాకు పెద్ద టాస్క్‌. హిందీ చదవడమూ, రాయడమూ వచ్చు. అయితే… నేను రెగ్యులర్‌గా మాట్లాడను. ఇప్పటికీ నా యాస దక్షిణాది వ్యక్తిలానే ఉంటుంది. హిందీ ప్రేక్షకులు నా డైలాగులు విని, వాళ్లలా మాట్లాడుతున్నాననుకోవాలి. అది ముఖ్యం. అందుకే, నా హిందీ యాసపై వర్క్‌ చేస్తున్నా.
  •  హాలీవుడ్‌లో ‘బాట్‌మ్యాన్‌’, ‘సూపర్‌మ్యాన్‌’ పాత్రలు చేసిన హీరోలు, ఆ తర్వాత సాధారణ పాత్రల్లో నటిస్తారు. మన దగ్గర గత సినిమాలో హీరో సూపర్‌మ్యాన్‌గా కనిపిస్తే, తర్వాత మామూలు పాత్ర చేేస్త అంతగా వర్కౌట్‌ కాదంటుంటారు. నా దృష్టిలో అది తప్పు. ప్రపంచంలో గొప్ప గొప్ప నటులందరూ ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు. మనమెందుకు చేయకూడదు. నేను చాలా యాక్షన్‌ సినిమాలు చేశా. ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత చిన్న ప్రేమకథ ‘డార్లింగ్‌!’ చేశా. మంచి కథ, హిట్టయ్యింది. సినిమా ఫ్లాపయితే.. కథ వల్ల ఆడలేదంటారు. ‘కథ వల్ల కాదు. కథలో, అందులో పాత్రలో హీరో సెట్‌ కాకపోవడం వల్ల సినిమా ఆడలేదేమో!’ అని నేనంటాను
  •  ఇప్పటివరకూ 50 రోజులు ‘సాహో’ షూటింగ్‌ చేశాం. త్వరలో దుబాయ్‌లో ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో పాల్గొంటాను.