బాలకృష్ణ ,కేఎస్ రవికుమార్ చిత్రం ప్రారంభం !

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమయింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించారు.సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే పంజాబీలో టాప్ హీరో ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా చేయబోతున్నారు. మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. చిత్రానికి సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ చేస్తుండగా.. కథ, మాటలు రత్నం, కెమెరామెన్‌గా రాం ప్రసాద్ చేస్తున్నారు.
చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో.. తర్వాత కుంభకోణంలో సినిమా చిత్రీకరిస్తామని తెలిపారు.  వైజాగ్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సినిమాకు మొన్నటివరకు ‘రెడ్డిగారు’ అనే టైటిల్ పెడతారంటూ ప్రచారం జరిగింది. తాజాగా జయసింహ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సింహా’ అనే పేరుతో వచ్చిన సినిమాలు బాలయ్య కెరీర్‌లో సూపర్ హిట్లు అవడంతో ‘జయసింహా’ అనే పేరుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అంబిక కృష్ణతో పాటు చిత్ర బృదం, తదితరులు పాల్గొన్నారు.