టాలీవుడ్‌లో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ఈ మధ్య హీరోలు బాగానే ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో సీనియర్ హీరోలే ముందు ఉంటున్నారు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మహేశ్‌తో కలసి నటించడానికి వెంకటేశ్ ముందుకొచ్చాడు. అలాగే ‘గోపాల గోపాల’ కోసం పవన్ కళ్యాణ్‌తో, ‘మసాలా’లో రామ్‌తో కూడా వెంకటేశ్ జతకట్టాడు. ఆ తర్వాత మరో సీనియర్ హీరో నాగార్జున కూడా కార్తితో కలసి ‘ఊపిరి’ చిత్రంలో అభినయించాడు. ఇప్పుడు మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా మల్టీస్టారర్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నలిచ్చినట్టు సమాచారం. టాలీవుడ్‌లో ఇప్పుడు అభిమానులు కలలో కూడా ఊహించలేని కాంబినేషన్ ఒకటి హల్‌చల్ చేస్తోంది .ఇద్దరు టాప్ హీరోలతో మాస్ దర్శకుడు బోయపాటి ఒక మల్టీస్టారర్ మూవీ సెట్ చేశాడట. ఇంతకీ బాలయ్యతో పాటు నటించబోతున్న మరో స్టార్ ఇంకెవరో కాదు మహేశ్ బాబు. అభిమానులు ఊహించలేని ఈ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
ఇప్పటికే బోయపాటికి రెండు విజయాలిచ్చిన బాలకృష్ణ ఈ చిత్ర కథ వినగానే ఎక్కువ ఆలోచించలేదట… వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మహేశ్ బాబు కూడా బాలయ్యతో సినిమా అనగానే రెండో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడట. ఈ ఇద్దరి హీరోలకి సరిపోయే ఒక మాస్ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ‘భరత్ అనే నేను’ తర్వాత మహేశ్ బాబు వంశీపైడిపల్లి సినిమాలో నటించనున్నాడు. అలాగే బాలయ్య కూడా ‘జై సింహా’ తర్వాత ‘యన్టీఆర్ బయోపిక్’ కమిట్ అయి ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోల కమిట్‌మెంట్స్ పూర్తయి ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి 2018 అవుతుందని తెలుస్తోంది.