పాతదారిలోనే బాలయ్య ….. ‘జై సింహా’ చిత్ర సమీక్ష

                                             సినీవినోదం రేటింగ్ : 2.25/5
సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై కె.ఎస్‌.ర‌వికుమార్‌ దర్శకత్వం లో సి.క‌ల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర‍్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్‌ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నది సినిమాలో చూడాలి ….
 
స్టార్ హీరోల‌ను చ‌క్క‌గా డీల్ చేస్తార‌నే పేరు తెచ్చుకున్నప్రముఖ దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ కి తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అభిమానులు ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా చేసాడు. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను ఆనంద పరిచినా.. కొత్తదనాన్ని ఆశిం‍చే ఆడియన్స్‌ను మాత్రం అలరించలేకపోయింది. కథ, కథనం, చిత్రీకరణ అన్నీ కూడా పాత సినిమాలని తలపిస్తాయే తప్ప… కొత్త చిత్రం చూస్తోన్న అనుభూతిని కలిగించవు. బాలక్రిష్ణ గత హిట్ సినిమాల తాలూకు ఛాయలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటాయి. కె.ఎస్. రవికుమార్ స్క్రీన్ ప్లే కూడా పాత తరహాలోనే …ముందు హీరో ప్రస్తుతం… ఆ తర్వాత అతని గతం… చివర్లో మళ్ళీ ప్రస్తుతం … అన్నట్టే ఉంటుంది కానీ, ఎక్కడా కొత్త పోకడ, వేగం కనిపించదు.
 
కథానానికి ముఖ్యమైన ప్రతినాయకులు, హీరో మధ్య వైరం చాలా బలహీనంగా ఉండటంతో బాలయ్య పాత్రలో కూడా తీవ్రత కొంత లోపించింది. బాలయ్య గత జీవితం చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది కానీ.. చూడటానికి అంత ఆసక్తికరంగా, ఉద్వేగత లేదు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర స్వభావాన్ని, అతని లవ్ ట్రాక్ ను వివరించడానికి తీసిన సన్నివేశాలు మరీ రొటీన్ గా ఉండి బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. ప్రతి సినిమాలోను ఎవరో ఒకరి గురించి సుదీర్ఘమైన డైలాగ్‌ చెప్పి శభాష్‌ అనిపించే బాలకృష్ణ కోసం ఈసారి బ్రాహ్మణులు, పూజారుల గొప్పతనం చాటిచెప్పే ఒక ఎపిసోడ్‌ పెట్టారు . బాలక్రిష్ణ నటన, ఇంటర్వెల్ బ్లాక్, హృదయాలను హత్తుకునే ఎమోషనల్ క్లైమాక్స్, కొన్ని బలమైన సన్నివేశాలు ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా…. పాత తరహా కథ, నెమ్మదిగా సాగే కథనం, తేలిపోయిన ప్రతినాయకుల పాత్రలు ఈ చిత్రం లో బలహీనతలు.
 
అభిమానించే వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని నరసింహ పాత్రలో బాలయ్య అభినందనీయం గా నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో చాలా బాగా చేసారు. ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్సుల్లో కూడా తన మాస్ మార్క్ ప్రదర్శించి ఆకట్టుకుని హీరోగా సినిమాకు ఎంత చేయాలో అంతా చేశారు బాలయ్య.బాల‌య్య ప‌డ్డ క‌ష్టం స్క్రీన్ మీద క‌నిపిస్తోంది. అమ్ముకుట్టి పాట‌లో ఆయ‌న వేసిన స్టెప్పులు, ఎమోష‌న‌ల్ సీన్స్, ఫైట్స్, అక్క‌డ‌క్క‌డా చెప్పే పంచ్ డైలాగులు, ఫ్యామిలీ సీన్స్ఆక‌ట్టుకున్నాయి. బాలయ్య జోడిగా నయనతార కు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకున్నా సినిమాకు ప్రత్యేకతగా నిలిచింది . ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో నయనతార నటన కంటతడిపెట్టిస్తుంది. నటషా దోషి, హరిప్రియల పాత్రల నిడివి చాలా తక్కువ.. కనిపించిన కాసేపు బాగానే చేసారు , గ్లామర్‌ తో మెప్పించారు. విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్ కీలక పాత్రలో తన మార్క్ చూపించాడు. విలన్‌లుగా కాళకేయ ప్రభాకర్, అశుతోష్ రానాలు ఆకట్టుకున్నారు. ఇటీవల వెండితెర మీద పెద్దగా కనిపించని సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాలో మరోసారి ఫెయిలయ్యారు .చంద్రముఖిలో వడివేలు చేసిన కామెడీని మళ్లీ బ్రహ్మానందంతో రిపీట్‌ చేయించారు.
 
ఎం.రత్నంఈ చిత్రానికి పాతతరహా క‌థ‌, మాట‌లు అందించారు.అయినా అతని పంచ్ డైలాగ్స్ తో అభిమానులని అలరించాడు. చిరంతన్ భట్ అందించిన పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ యావరేజ్ గానే ఉన్నాయి. బాణీలు క్యాచీగా లేవు. నేపథ్య సంగీతం అవసరానికి మించిన వాయిద్యాలతో హోరెత్తిస్తుంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు అసెట్ అయ్యింది . ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది -రవళి