సేవా సంస్థ పెట్టి అంధులతో ‘స్పా’ ఏర్పాటు చేసా !

అంధులకు చేతనైనంత సాయం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అదే స్ఫూర్తితో ఓ ఎన్జీఓ మొదలుపెట్టి ‘స్పా’ ఏర్పాటు చేశాను. మామూలుగా చూపున్న వారితో మసాజ్‌లు చేయించుకోవడానికి చాలా మంది ఇబ్బందిపడతారు. కానీ వీరి దగ్గర చాలా సౌకర్యంగా భావిస్తారు…… అని చెప్పింది అందాల నాయిక శ్రియ.

నేను మా స్టాఫ్‌ నుంచి నేర్చుకున్న కీలకమైన అంశం ఏంటంటే – పాజిటివ్‌ థింకింగ్‌. ప్రపంచాన్ని మిగిలినవాళ్లు చూసే దృష్టి వేరు. వాళ్లు చూసే దృష్టి వేరు. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పడం వాళ్లకు చేతకాదు. పరిస్థితులను చూసి వాళ్లు భయపడరు. ఒకవేళ ఇబ్బందులు ఎదురైనా వాటి నుంచి బయటపడటం వాళ్లకు చాలా బాగా తెలుసు….
వారిని ఎప్పుడు కలిసినా… ‘ఈ రోజు ఎంతో బావుంది. ఇవాళ చాలా మంచి రోజు.. మానసికంగా ప్రశాంతంగా ఉంది. నిన్న బ్యూటీఫుల్‌ సినిమా చూశాను..’ వంటి పాజిటివ్‌ మాటలే చెబుతారు. సినిమాను వాళ్లు చూడలేరు. కానీ వింటారు. అందులోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ అన్నీ ఉన్న మనం లోపాలు వెతుకుతుంటాం. వాళ్లతో మాట్లాడిన ప్రతిసారీ నాకు కొత్త ప్రదేశాన్ని చూసినట్టుగా, ఈ లోకంలో మళ్లీ పుట్టినట్టుగా అనిపిస్తుంటుంది.
ప్రతి వాసనా నన్ను కట్టిపడేస్తుంది!
నిద్ర లేవగానే ప్రశాంతంగా ‘ఓమ్‌’ మంత్రాన్ని వింటా. ప్రతి రోజూ జిమ్‌కి వెళ్తా. యోగా, విపాసన మెడిటేషన్‌ చేస్తా. సమయం ఎక్కువగా ఉంటే స్నేహితులని కలుస్తా. లేకుంటే నేను నటిస్తున్న సినిమా, అందులోని పాత్ర గురించి ఆలోచిస్తా. అనవసరమైన ఆందోళనను దరిచేరనివ్వను. వీలైనంత వరకు ఇంట్లో వండిన పదార్థాలే తింటాను. వంటింట్లో నుంచి వచ్చే ప్రతి వాసనా నన్ను కట్టిపడేస్తుంది. నాకు ఇండియన్‌ ఫుడ్‌ ఇష్టం. మన దగ్గరున్నన్ని వెరైటీ డిషెస్‌ ప్రపంచంలో ఎక్కడా ఉండవని నా నమ్మకం. అందులోనూ నార్త్‌ టు సౌత్‌ నేను చాలా వెరైటీలను టేస్ట్‌ చేశాను.
ప్రతి రచయితనూ గౌరవిస్తుంటా!
కొత్త పుస్తకం ఏం కనిపించినా వెంటనే చదివేస్తా. కానీ ఫేవరేట్‌ రైటర్‌ ఎవరు అని అడిగితే టక్కున చెప్పలేను. ఎందుకంటే రాసే ప్రతి ఒక్కరూ ఎంతో జ్ఞానాన్ని సేకరించి, గుదిగుచ్చి ఇస్తుంటారు. అందుకే నేను ప్రతి రచయితనూ గౌరవిస్తుంటా.
మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది!
ఏ మాత్రం చిన్న గ్యాప్‌ దొరికినా బ్యాగ్‌ సర్దుకుని ఎక్కడో ఓ చోటుకి వెళ్తాను. నాకు ఫేవరెట్‌ ప్లేస్‌లు ఉండవు. నాకు జర్నీ ఇష్టం. ప్రయాణం శారీరకంగా అలసటను కలిగిస్తుందేమో కానీ, మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుంది. తెలివితేటలు పెరగడానికి ఎక్కువగా సహకరిస్తుంది. నటిని కావడం వల్ల చాలా మంది చూడలేని, చూడని ప్రదేశాలను కూడా చూడగలిగాను. అదే సగటు మహిళగా ఉంటే, ఇన్ని ప్రదేశాలను చూసేదాన్నో, లేదో నాకు తెలియదు. ట్రావెలింగ్‌ అనగానే ఫారిన్‌ లొకేషన్స్‌నే ఊహించుకోవద్దు. స్లమ్స్‌లో చేసిన షూటింగ్‌ను కూడా నేను పరిగణనలోకి తీసుకుంటా.