ఈ బిజీ నటికి ఇరవై గంటల డ్యూటీ !

బాలీవుడ్‌లో భూమి పడ్నేకర్‌  ఏ విషయంపై అయినా సూటిగా మాట్లాడే నటి. ఆమె ఏ సినిమా చేసినా అందులో పాత్ర చాలా ప్రభావవంతంగా, ప్రత్యేకంగా ఉంటుంది. భూమి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఉన్న 24 గంటల్లో 18 గంటల పాటు సినిమాలకే కేటాయించాల్సి వస్తుంది. ఒక పక్క షూటింగ్‌…మరో పక్క విడుదల కానున్న చిత్రాల కోసం ప్రమోషన్‌ తో తీరిక లేకుండా ఉంది.
 
భూమి ‘దమ్‌ లగ కీ హైషా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి నటిగా అరంగేట్రం చేసి .. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. కొన్ని పాత్రల కోసం టాన్స్‌ఫర్మేషన్‌ కూడా అయింది. చాలా బరువు తగ్గి ‘ఆ పాత్రలూ చేయగలను’ అని నిరూపించింది. ఇవి కాకుండా ‘టాయిలెట్‌ : ఏక్‌ ప్రేమ్‌ కథ’, సుభ్‌ మంగల్‌ సవ్‌ధాన్‌’, లుస్ట్‌ స్టోరీస్‌’, ‘సన్‌ చిరియా’ వంటి చిత్రాల కోసం ఆమె మారిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఇటీవల చేసిన ‘సాంద్‌ కీ ఆంఖ్‌’లో భూమి వరల్డ్‌ ఓల్డెస్ట్‌ షార్ప్‌ షూటర్‌ చద్రో తోమర్‌గానూ, ఆమె సోదరి ప్రకాషిగా తాప్సీ పన్ను నటించారు . ఇందులో చంద్రో తోమర్‌గా చేసిన పాత్ర తనకో సవాల్‌గా నిలిచిందని పేర్కొంది భూమి.
 
భూమి ప్రస్తుతం ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ ప్రమోషన్‌ పనులు ఒక పక్క, మరో పక్క.. ‘పతి పత్నీ ఔర్‌ ఓ’ షూటింగ్‌తో తన సమయం అంతా కేటాయించాల్సి వస్తుంది. భూమి చేస్తోన్న మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పతి పత్నీ ఔర్‌ ఓ’ సినిమాలో ఈమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇక మరో పది రోజులు పాటు ‘బాల’ సినిమా ప్రమోషన్‌లో బిజీ కానుంది. అందులోనూ ఒక్క ‘సాంద్‌ కీ ఆంఖ్‌’ చిత్రం ప్రమోషన్‌కే 30 రోజులు కేటాయించింది. ఎందుకంటే… ఇందులో సామాజిక సందేశం ఉండడంతో చాలా ఆసక్తి చూపింది భూమి. అంతేకాదు ఒక రోజే రెండు చిత్రాలకు ప్రమోషన్‌ చేపట్టాల్సి రావడంతో రెండు రోజుల పాటు 20 గంటల డ్యూటీ కూడా చేసిందట.
 
‘భాగమతి’ అనుష్క పాత్రలో?
మన తెలుగు ‘భాగమతి’  బాలీవుడ్ రీమేక్ విషయంలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో అనుష్క పాత్రలో భూమి పెడ్నేకర్ నటించనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తెలుగులో ‘భాగమతి’ సినిమాను తెరకెక్కించిన జి.అశోక్ రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ‘టాయిలెట్’, ‘ఏక్ ప్రేమ్‌కథ’ సినిమాలను చేసినవారే ఈ సినిమాను కూడా నిర్మించనున్నట్టు వినిపిస్తోంది .
ప్రస్తుతం ఈ చిత్రబృందం సినిమాకు తగ్గ లొకేషన్ కోసం గాలిస్తోందని తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్టు సమాచారం. అయితే బాలీవుడ్ స్టార్ ఒకరు…. ‘భాగమతి’ సినిమా డైరెక్టర్ అశోక్‌ను కలిసి రీమేక్‌కు తాను దర్శకత్వం వహిస్తానని అడిగినట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరై ఉంటారా? అని అంతా ఆసక్తి చూపుతున్నారు.