భారీ బడ్జెట్‌తో 3డీ ‘రామాయణ’

‘బాహుబలి’ని మించి.. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో  ఓ సినిమా రాబోతోంది. ‘రామాయణ’ పేరుతో ఆ సినిమా తెరకెక్కబోతోంది.
 
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో పాటు మరో ఇద్దరు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ వెలువడింది.
 
‘రామాయణ’ సినిమాలో అన్నీ ప్రత్యేకతలే. ఇది 2డీ సినిమా కాదు. 3డీ సినిమా. సినిమా మొత్తం 3డీ కెమెరాలతోనే చిత్రీకరిస్తారు. బడ్జెట్ 500 కోట్లు. మూడు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తీయనున్నారు. 2021లో మొదటి పార్ట్ విడుదల కానుంది.
 
అయితే.. ఈ సినిమాలో ఎవరు నటిస్తారు.. అనే విషయం తెలియనప్పటికీ.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా.. భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు ఇందులో నటిస్తారట.
 
అల్లు అరవింద్‌తో పాటు మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలిసి సినిమాను నిర్మిస్తుండగా… ‘దంగల్’ ఫేం నితేశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
 
ఇప్పటికే వెయ్యికోట్ల బడ్జెట్‌తో ‘మహాభారత’ను మలయాళం మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రకటించారు. ఆయన మహాభారతలో భీమ పాత్రను పోషిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. దాని తర్వాత రెండో అతి పెద్ద భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే చిత్రం రామాయణ అవుతుంది.