ఎన్టీఆర్‌ దసరా సినిమాకు భారీ బిజినెస్ !

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన లభించింది. వారిద్దరి కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం రూపొందుతోంది. ఇది పూర్తి మాస్‌ మసాలా చిత్రం. చిత్తూరు కుర్రాడిలా ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. చిత్తూరు యాసలో మాట్లాడడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. సెట్స్‌పైకి వెళ్లే ముందు శారీరక మార్పులు కూడా వచ్చేలా చేశాడు.

ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే వ్యాపారం జరిగిపోయింది. ఓవస్‌సీస్‌తో సహా అన్ని చోట్లా అమ్మకం అయిపోయింది. ‘ఎల్‌ఏ తెలుగు’ అనే సంస్థ అమెరికాలో ప్రదర్శనకు ఈ చిత్రం రైట్స్‌ను దక్కించుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి. నెల్లూరు జిల్లాకే భారీగా రూ.3.40కోట్లకు ప్రదర్శన రైట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన చోట్లా భారీ మొత్తం అమ్ముడైనట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని హారికా హసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లోఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పూజా హెగ్డే కథానాయిక. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ మల్టీ స్టారర్‌ నవంబర్‌ నుంచి

రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ ఎప్పుడూ మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు.తాజాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్‌ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

డిసెంబర్ నెలాఖరు కల్లా చరణ్ కూడా రాజమౌళి టీంతో జాయిన్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌ నుంచి రాజమౌళి సినిమా పనుల్లో బిజీ కానున్నాడు జూనియర్‌. రామ్‌ చరణ్ కూడా డిసెంబర్‌ కల్లా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను ముంగిచేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.