‘జీవితం ఏమైపోతుంది?’ అని ఆలోచించడానికి సమయం దొరికింది!

“ఇంతకుముందు ఎవరి పనుల్లో, ఎవరి ప్రపంచంలో వాళ్లం ఉరుకులు పరుగులు తీస్తూ ఉండేవాళ్లం. తీరికగా కూర్చొని జీవితం ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? అని ఆలోచించడానికి పెద్దగా సమయం దొరికింది లేదు.కానీ ప్రస్తుతం మనందరికీ దొరికిన ఈ తీరిక వల్ల ఆలోచించడానికి, ఏం జరుగుతుందో లెక్క వేసుకోవడానికి సమయం దొరికింది”….అని అన్నారు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌. ఇటీవలే అమితాబ్‌ తనకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.. ఆయనకే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కుమారుడు అభిషేక్‌ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం వీరందరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలో తన మదిలో మెదిలిన ఆలోచనలను తన బ్లాగ్‌ లో పంచుకున్నారు అమితాబ్‌…
నా క్షేమం కోసం ప్రార్థించిన వారికి, మీ ఆలోచనల్లో నన్ను ఉంచినవారికి ఏం చేయగలను? ఏం ఇవ్వగలను? రెండు చేతులు జోడించడం తప్ప?’’ అంటూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆలోచనలతో జాగ్రత్తగా ఉండాలి !
‘‘ఇంతకుముందు ఎవరి పనుల్లో, ఎవరి ప్రపంచంలో వాళ్లం ఉరుకులు పరుగులు తీస్తూ ఉండేవాళ్లం. తీరికగా కూర్చొని జీవితం ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? అని ఆలోచించడానికి పెద్దగా సమయం దొరక లేదు.కానీ ప్రస్తుతం మనందరికీ దొరికిన ఈ తీరిక వల్ల ఆలోచించడానికి.. ఏం జరుగుతుందో లెక్క వేసుకోవడానికి సమయం దొరికింది. ఇలాంటి సమయంలోనే.. ఆలోచనలు మన మెదడులోకి మరింత వేగంగా ప్రవేశిస్తుంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకు ముందు ఈ ఆలోచనలు లేవా? అంటే.. మనందరం మన పనులతో బిజీగా ఉండటంతో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే , ఉరికే మెదడు మనందర్నీ విచిత్ర స్థితిలో పడేస్తుంటుంది. ఇలాంటి ఆలోచన మనకు వస్తుందా? అనే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ ఆలోచనలతో ఏకీభవిస్తావు.. అంగీకరించవు.. పట్టించుకుంటావు.. పట్టనట్టు ఉంటావు.అయినా ఆలోచనలు మాత్రం ఆగవు.
ఇలాంటి సమయంలోనే కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానుల మీద గౌరవం మరింత పెరుగుతుంది. సాధారణ మనుషులం ఆలోచించలేని విషయాలను వాళ్లు.. ఎంతో కష్టతరమైన కృషితో ఆలోచించి మన ప్రయాణాన్ని సులభం చేస్తున్నారు. కానీ ‘మన అందరిలోనూ అలాంటి ప్రతిభ దాగి ఉంది’ అని నేను నమ్ముతాను. ప్రస్తుతం నా మదిలో ఆలోచనలు దేని కోసమో నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు సమాధానాలు దొరుకుతాయి. కొన్నిసార్లు సీలింగ్‌ ఫ్యాన్‌ రెక్కల్లో చిక్కుకుపోతాయి. అంతా సాధారణ స్థితికి రావాలని కోరుకుంటాయి’’ అని తన ఆలోచనలను వ్యక్తపరిచారు అమితాబ్‌.
 
నిశ్శబ్దంగా  వెళ్లిపోయింది !
“అది పోయేటప్పుడు కూడా నిశ్శబ్దంగా పోయింది. ఎవరికీ హాని కలిగించకుండా మెల్లగా వాలిపోయింది” అని తన బ్లాగులో రాసారు అమితాబ్‌. “బాధ ఇంటి మనిషిని కోల్పోయినప్పుడు మాత్రమే ఉండదు. ఇంటిలో చెట్టును పోగొట్టుకున్నప్పుడు కూడా ఉంటుంది”. అమితాబ్‌ ఇప్పుడు అలాంటి బాధలో ఉన్నారు .43 ఏళ్లుగా ఆయన ఇంట నీడనిస్తూ వచ్చిన ఒక గుల్‌మొహర్‌ చెట్టు మొన్నటి భారీ వర్షాలకు కూకటివేళ్లతో సహా కూలిపోయింది. అమితాబ్‌ ఆ చెట్టు ఫొటోలను తన బ్లాగ్‌లో పెట్టి దానితో తన అనుబంధాన్ని పంచుకున్నారు.
అమితాబ్‌ బంగ్లా పేరు ‘ప్రతీక్ష’ .1976లో అమితాబ్‌ ఆ బంగ్లా కొన్నప్పుడు బంగ్లా మధ్యస్థలంలో అడుగు ఎత్తున ఉన్న ఆ మొక్కను నాటారట. అప్పటి నుంచి ఇంట్లో అది కూడా ఒక భాగమయ్యింది. “పిల్లలు దాంతో పాటు పెరిగారు. దాని కిందనే ఆడుకున్నారు. హోలీ వచ్చినా..దివాలి వచ్చినా ఆ చెట్టుకే మేము అలంకరణ చేసేవారం. అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి ఆ చెట్టు కిందనే జరిగింది. మా అమ్మా నాన్నలు మరణించినప్పుడు ఆ చెట్టు కింద జరిగిన ప్రార్థనల్లో అది కూడా పాల్గొంది..ఇవాళ అది లేదు’ అని ఆయన భావోద్వేగంతో రాసుకొచ్చారు.