పి.వి పై పుస్త‌కం ఆధారంగా వెబ్ సిరీస్ ‘హాఫ్ ల‌య‌న్‌’

భార‌తదేశ మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావుపై రాసిన పుస్త‌కం ‘హాఫ్ ల‌య‌న్‌’ను ఆధారంగా  చేసుకుని ఓ వెబ్ సిరీస్‌ తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌ వారి  కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి పాన్ ఇండియా బై లింగువ‌ల్ వెబ్ సిరీస్ ‘హాఫ్ లయన్’ను రూపొందిస్తున్నారు. పి.వి.న‌ర‌సింహారావు విశేషాల‌తో  విన‌య్ సీతాప‌తి రాసిన పుస్త‌కం ‘హాఫ్ ల‌య‌న్‌’. ‘గంగాజ‌ల్‌’, ‘అప‌హ‌ర‌ణ్‌’, ‘రాజ్‌నీతి’ వంటి సోషియో పొలిటిక‌ల్ చిత్రాలు..అవార్డ్ విన్నింగ్ డ్రామా సిరీస్ ‘అస్త్రం’ వంటి వాటితో ప్రేక్ష‌కుల అభినందనలు పొందిన ద‌ర్శ‌కుడు,జాతీయ అవార్డ్ గ్రహీత ప్రకాష్ ఝా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించ‌నున్నారు.
ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ్ ఝా మాట్లాడుతూ… ‘రియల్ లైఫ్ స్టోరీస్ పై వర్క్ చేయడం ఎప్పుడూ చాలా కొత్తగా, ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. ఆహా వంటి మాధ్య‌మంలో ఇలాంటి కాన్సెప్ట్స్ చేయ‌డం అనేది హ్యాపీగా ఉంది. ఇక అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్ప‌టికే కంటెంట్‌ను క్రియేటింగ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యింది.  ఈరోజు దేశం ఇలా ముందుకు వెళుతుందంటే… అందుకు ఎంతో కీల‌క‌మైన పాత్ర‌ పోషించిన వ్య‌క్తుల్లో ఒక‌రైన పి.వి.న‌ర‌సింహారావు గురించి సిరీస్ చేయ‌డం ఆనందంగా ఉంది. నేటి త‌రం ఆయ‌న నుంచి నేర్చుకోవాల్సిన విష‌యాలు ఎన్నో ఉన్నాయ‌నేది నా న‌మ్మ‌కం’ అన్నారు.
‘ఆహా’ ప్ర‌మోట‌ర్, ప్ర‌ముఖ నిర్మాత‌ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ…  ‘అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మీర్ నాయ‌ర్‌గారితో భాగ‌స్వామ్యం కావ‌డంతో ఎంతో ఆనందంగా ఉంది. మ‌న భార‌త మాజీ ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహా రావుగారి క‌థ‌ను గ్లోబ‌ల్ ఆడియెన్స్‌కు అందించే అవ‌కాశం రావ‌డం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను’అన్నారు.
అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఈఓ స‌మీర్ నాయ‌ర్ మాట్లాడుతూ… ‘ఆహా స్టూడియో క‌లిసి ప‌నిచేయ‌డం కొత్త అధ్యాయమ‌నే చెప్పాలి. మా కాంబినేష‌న్ అనేది స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసే కంటెంట్‌ను క్రియేట్ చేస్తుంద‌ని భావిస్తున్నాం.  మేం పి.వి.న‌ర‌సింహారావుగారి బ‌యోపిక్ చేస్తున్నాం.  మా తొలి ప్ర‌య‌తాన్ని ఆవిష్క‌రిస్తున్న ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ ఝా గారికి కూడా థాంక్స్‌’ అన్నారు.