నా పాత్రలపై ఆముద్ర వేయడం సమంజసం కాదు !

ఈ మధ్య కాలంలో ప్రముఖ దర్శకులు సైతం షార్ట్ ఫిల్మ్ ముసుగులో బూతును ప్రమోట్ చేస్తున్నారు. అయితే బోల్డ్ నెస్ పేరుతో అమ్మడు బరితెగించి నటించేస్తోందనే విమర్శలూ లేకపోలేదు. రంగస్థలం, టీవీ, సినిమా, మీడియం ఏదైనా తనకు ఒకటే నంటోంది నటి రాధికా ఆప్టే.
 పూణెకు చెందిన రాధికా ఆప్టే చిన్నతనంలోనే నృత్యం నేర్చుకుంది. యుక్త వయసులో నాటకరంగంలోకి అడుగుపెట్టిన రాధికా ఆ తర్వాత లండన్‌లో కాంటెంపరరీ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. అభ్యుదయ భావాలు కల రాధికా ఆప్టే తొలిసారి ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగువారి ముందుకు వచ్చింది. అందులో రాధిక నటన చూసి ఔరా అనుకున్నారు. ఆ తర్వత ‘ధోని’లోనూ, ఆపైన బాలకృష్ణ సరసన ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అయితే ఆ వెంటనే బాలీవుడ్‌లో బోల్డ్ ఫిల్మ్స్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
 గడిచిన పుష్కరకాలంలో వివిధ భాషా చిత్రాల్లో నటించింది రాధికా ఆప్టే. మధ్యలో నాటకాల్లో నటిస్తూనే టీవీ సీరిస్‌లకూ సై అంది. అంతేకాదు ఇప్పడు వెబ్ సీరిస్‌పైనా అమ్మడు దృష్టి పెట్టింది. తాజాగా సైఫ్ అలీఖాన్‌తో ‘స్కేర్డ్ గేమ్స్’ వెబ్ సీరిస్‌లో రాధికా ఆప్టే నటిస్తోంది. ఉద్దేశ్య పూర్వకంగానే లీక్ చేశారేమో తెలియదు కానీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో రాధికా ఆప్టే అర్థనగ్నంగా నటించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను చేసే బోల్డ్ క్యారెక్టర్లపై అసభ్యకరమైన పాత్రలనే ముద్ర వేయడం సమంజసం కాదంటోంది రాధికా ఆప్టే. విశేషం ఏమంటే త్వరలో సొంత కాన్సెప్ట్స్‌తో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తానని రాధికా ఆప్టే చెబుతోంది. మరి రాధికా ఆప్టే ఎలాంటి లఘు చిత్రాలు తీస్తుందో చూడాలి.