‘కాలా’తో సౌత్‌లో సత్తాచూపుతానంటోంది !

‘గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన  బ్యూటీ హ్యూమా ఖురేషి సౌత్‌లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కాలా’ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. రజనీతో ‘కబాలి’ సినిమా తీసిన పా.రంజిత్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం నాటి ముంబయ్ గ్యాంగ్‌స్టర్ కథ నేపథ్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

రజనీ ‘కాలా’ తనకు సౌత్‌లో మంచి క్రేజ్  తీసుకువస్తుందని భావిస్తోంది హ్యూమా ఖురేషి.  ఈ చిత్రం తర్వాత దక్షిణాదిన మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆమె ఆశపడుతోంది. ‘కాలా’తో సౌత్‌లో సత్తాచాటుతానంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే హ్యూమా హిందీలో ఓ టివి షో చేయనుంది. ఈ షో పేరు ‘ఇండియా 70’. కాలగమనంలో సమాజంలో గొప్ప మార్పు తెచ్చిన వ్యక్తుల నిజ జీవిత గాథలను తెలియజేసే విధంగా ఈ షోను ప్లాన్ చేశారు. ఆయా రంగాల్లో పేరొందిన వారు చేసిన కృషి, సాధించిన విజయాలను ఈ షోలో పరిచయం చేయనున్నారు.