సుశాంత్ సింగ్ ‌ ఆత్మహత్య : బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి!

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తో బాలీవుడ్ షాక్ కి గురైంది. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీవీ సీరియళ్లతో కెరీర్‌ స్టార్ట్ చేసి సినిమాలతో విజయవంతంగా దూసుకుపోతున్నారు సుశాంత్. ఇలాంటి సమయంలో సుశాంత్ ఆత్మహత్య పలు అనుమానాలకు దారి తీస్తోంది.
 
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ 1986 జనవరి 21న పాట్నాలో జన్మించాడు. టీవీ సీరియల్స్‌ ద్వారా నటుడిగా పరిచయమైన సుశాంత్‌ ఆ తర్వాత డ్యాన్సర్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘కిస్‌ దేశ్‌ మే హై మేరా దిల్‌ చిల్‌’ షో నటుడిగా కెరీర్‌ ఆరంభించిన సుశాంత్ జీ టీవీలో పాపులర్‌ అయిన ‘పవిత్ర రిస్తా’ కు అవార్డు కూడా అందుకున్నాడు.కాగా 2013లో ‘కై పో చే’ సినిమాతో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా పరిచయమై ఆ తర్వాత ‘శుద్ధ్ దేశీ రొమాన్స్‌’ సినిమాలో నటించాడు. ‘డిటెక్టివ్‌ భ్యోమకేశ్‌ బక్షీ’లో డిటెక్టివ్‌ పాత్రతో అందరినీ ఆకట్టుకొనేలా తన ప్రతిభను చాటాడు. అమీర్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘పీకే’ సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌ లో కూడా మెరిశాడు. 2016లో వచ్చిన టీమిండియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బయోపిక్‌ ‘ఎంఎస్‌ ధోని..ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ లో తన నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. ‘కేదార్‌నాథ్’‌ చిత్రంలో లవర్‌బాయ్‌ పాత్రలో సుశాంత్‌ అలరించాడు.
 
అయితే సుశాంత్‌ సింగ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఆరు నెలలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సుశాంత్‌ సన్నిహితులు కూడా అతను తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు వెల్లడిస్తున్నారు. కాగా శనివారం రాత్రి తన బెష్ట్ ఫ్రెండ్స్ ని కలిసిన సుశాంత్..వారితో ఎటువంటి విషయాలు పంచుకోలేదు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సుశాంత్ బయటికి రాకపోవడంతో పనిమనిషికి డౌట్ వచ్చి వాళ్ల ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది. దీంతో స్నేహితులు వచ్చి తలుపులు బద్దలు కొట్టడంతో… సుశాంత్ అప్పటికే చనిపోయి ఉన్నారు. కాగా ఆ మధ్య సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సేలియన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మానసిక వత్తిడికి కారణం ఏమిటి అనేది మాత్రం తెలియడం లేదు. ఆదిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అపారమైన టాలెంట్ ఉన్న నటుడు!
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య జీర్ణించుకోలేని వార్తగా బాలీవుడ్ భావిస్తోంది. బాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ హీరోలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. స్టార్ హీరో అక్షయ్ కుమార్.. సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించారు. ఈ వార్త తెలిసిన వెంటనే మాటలు రాలేదని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. అలాగే.. ‘సుశాంత్ నటించిన ‘చిచ్చోరో’ సినిమా చూసి ఎంతో ఆస్వాదించాను. అపారమైన టాలెంట్ ఉన్న నటుడు సుశాంత్. వారు కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. వారికి ఈ వార్తను తట్టుకొనే శక్తిని దేవుడు ప్రసాదించాలి’ అంటూ ఆక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
పొంగిపొర్లే ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అకాల మరణం వార్త విన్న తర్వాత మాటలకందని వేదన కలిగిందని.. షాక్ కు గురయ్యానని తెలిపారు. పొంగిపొర్లే ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం వంటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చాలా చిన్నవయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని మహేశ్ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో సుశాంత్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని మహేష్ స్పష్టం చేశారు.