లైంగికతను అవకాశంగా మార్చుకునే వారూ ఉన్నారు !

 ఇండస్ట్రీలో లైంగికతను అవకాశంగా మార్చుకున్న యాక్టర్ల సంఖ్య కూడా తక్కువేమీకాదు. చాన్స్‌ రావడమే ముఖ్యమని వారు భావిస్తారు.సినిమా అవకాశాల సాకుతో లైంగిక వేధింపులకు పాల్పడే దర్శకనిర్మాతల కంటే.. చాన్స్‌ కోసం అదే లైంగికతను పణంగా పెట్టే నటీనటులు ఇండస్ట్రీలో బోలెడుమంది ఉన్నారని ప్రముఖనిర్మాత, ‘ఫైర్‌బ్రాండ్‌’ ఏక్తా కపూర్ అన్నారు . సెక్సువాలిటీ మీద చర్చ జరిగిన ప్రతిసారి.. శాసించేస్థితిలో ఉన్నవారినే దోషులుగా చిత్రీకరించడం తగదని, ఒకరి దగ్గర డబ్బు, హోదా, అధికారం లేనంత మాత్రాన వారినే బాధితులుగా భావించాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు.

ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖా దత్‌ నిర్వహించిన షోలో మాట్లాడుతూ ఏక్తా కపూర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హాలీవుడ్‌ మెగా ప్రొడ్యూసర్‌ విన్‌స్టన్‌ హార్వీ అకృత్యాలను బయటపెట్టిన ‘మీ టూ’ ఉద్యమం లాంటిది బాలీవుడ్‌లోనూ తలెత్తితే పరిస్థితి ఏమిట’న్న ప్రశ్నకు ఏక్తా తనదైనశైలిలో సమాధానమిచ్చారు….

‘‘అవును. ఇక్కడ(బాలీవుడ్‌లో) కూడా లైంగిక వేధింపులకు పాల్పడే విన్‌స్టన్‌లు చాలా మంది ఉన్నారు. అయితే అదే లైంగికతను అవకాశంగా మార్చుకున్న యాక్టర్ల సంఖ్య కూడా తక్కువేమీకాదు. చాన్స్‌ రావడమే ముఖ్యమని వారు భావిస్తారు. అఫ్‌కోర్స్‌, వారు తప్పుకాకపోవచ్చు. కానీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం పవర్‌లో ఉన్నవాళ్లనే దోషులుగా చిత్రీకరించడాన్ని మాత్రం నేను సమర్థించను.ఉదాహరణకి… ఒక నటి రాత్రి 2 గంటలప్పుడు నిర్మాత దగ్గరికి వెళ్లిందనుకుందాం, కొన్ని రోజుల తర్వాత ఆ నిర్మాత తన సినిమాలో ఆమెకు చాన్స్‌ ఇవ్వలేదు. ఆ పాత్రకు ఆమె సరిపోదు కాబట్టి అతనలా చేశాడు. పర్సనల్‌ విషయాలను, ప్రొఫెషనల్‌ విషయాలను వేరుగా చూస్తాడు కాబట్టి అతనా నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఉదాహరణలో ఎవరు బాధితులు? శక్తిమంతులే అడ్వాంటేజ్‌ తీసుకుంటారనే భావన ఎల్లప్పుడూ సరైందికాదు’’అని ఏక్తా చెప్పుకొచ్చారు.