జె.ఎల్‌.ఇ.సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ ప్రారంభించిన బోయ‌పాటి శ్రీను

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ప‌ట్టంలో అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించిన జె.ఎల్‌.ఇ. సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను శుక్ర‌వారం ప్రారంభించారు. అధునాత‌మైన సౌండింగ్ టెక్నాల‌జీని ప్రేక్ష‌కుల‌కు అందించే టెక్నాల‌జీతో రాము పొలిశెట్టి మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్‌ను నిర్మించారు. ఇండియ‌న్ సినిమా ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచానికి చాటిన బాహుబ‌లి-2 సినిమాను ఈ జె.ఎల్‌.ఇ. సినిమాస్‌లో తొలిసారిగా ప్ర‌ద‌ర్శించారు. వారాంత‌పు రోజులు కావ‌డంతో ప్రేక్ష‌కులతో థియేటర్ నిండిపోయింది. అంతే కాకుండా ప్రేక్ష‌కులు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చేసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇంకా ప్ర‌ముఖ నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)తో పాటు టీడీపీ ఎమ్మెల్యే మొదుగుల వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ “గుంటూరు ప‌ట్టణంలో ఇంత టాప్ స్టాండ‌ర్డ్‌లో థియేట‌ర్ నిర్మించ‌డం ఆనందంగా ఉంది. డ‌బ్బు అంద‌రి ద‌గ్గ‌ర ఉంటుంది. కానీ టేస్ట్ కొంద‌రి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉంటుంది. ఇంత పెద్ద మ‌ల్టీ ప్లెక్స్ థియేట‌ర్‌ను క‌ట్టిన రాము పొలిశెట్టిగారిని ఈ సంద‌ర్భంగా అభినందిస్తున్నాను“ అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే బెస్ట్ థియేట‌ర్ అని కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిథులు రాము పొలిశెట్టిని అభినందించారు.