ఇప్పుడు ఆడంబర జీవితం నచ్చడంలేదు!

మలయాళీ బ్యూటీ అమలాపాల్‌…. ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంతో సినీ పరిశ్రమకి పరిచయం అయింది. ‘బెజవాడ’ తో తెలుగులో నటించింది…ఆ తర్వాత ‘లవ్ ఫెయిల్యూర్’..’నాయక్’..’ఇద్దరమ్మాయిలతో’..’జెండా పై కపిరాజు’..’విఐపి2′ చిత్రాలలో మెప్పించింది.అమలాపాల్‌ ఎంత వేగంగా ఎదిగిందో…అంతే వేగంగా ప్రేమలో పడిపోయింది. ‘దైవ తిరుమగళ్’, ‘తలైవా’ చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆ చిత్రాల దర్శకుడు విజయ్‌తో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి చేసుకున్నారు. అయితే వారి పెళ్లి రెండేళ్లు మాత్రమే సాఫీగా సాగింది. మనస్పర్థలతో విడిపోయి, విడాకులు కూడా తీసుకున్నారు.
 
అమల మాత్రం పలు సినిమాలతో బిజీగా ఉంది. గ్లామర్ కి హద్దులు చెరిపేసింది. సోషల్ మీడియాలో అత్యంత ఆదరణ..ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా రికార్డును సొంతం చేసుకుంది. ఈమె ‘ఇన్ స్టా గ్రామ్’ అకౌంట్ 30లక్షల మంది ఫాలోవర్స్ పెరగడం విశేషం. తమిళంతో పాటు మలయాళ చిత్రాల్లో కూడా మెరిసింది. అంతేకాదు.. “త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాన”ని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది. అమలా నటించిన “రాక్షసన్” విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఆతర్వాత ‘ఆడై’ (ఆమె) లో బోల్డ్ గా చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో దర్శకులిప్పుడు కథలను పట్టుకుని ఆమెచుట్టూ తిరుగుతున్నారు.
అయితే ఇప్పుడు అమల మాత్రం… చాలా నిరాడంబర జీవించడాన్ని కోరుకుంటోంది. ఇటీవల తరచూ పాండిచ్చేరిలో గడపడానికి ఇష్టపడుతోంది. “పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమంలో తనకు ఎంతో మనశ్శాంతి లభిస్తోందని, ఇక్కడ తనకోసం కొత్త జీవితం ఎదురుచూస్తున్న భావన కలుగుతోంద”ని పేర్కొంటోంది. ఇప్పుడు తనకు ఆడంబర జీవితాన్ని అనుభవించడం నచ్చడంలేదని అంటోంది. సహజమైన ప్రకృతి మధ్య జీవించాలనిపిస్తోందని చెప్పింది. ఆ మధ్య వివాదాల తో విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన కారును కూడా అమలాపాల్‌ అమ్మేసింది. ఈ మధ్యనే హిమాలయాలను చుట్టేసి వచ్చిన అమలాపాల్‌… ప్రకృతిలోని సహజమైన అందాలను ఆస్వాదిస్తూ జీవించడం ఇష్టంగా ఉందని అంది. చిన్న సంచిలో కొన్ని బట్టలు తీసుకుని ఒక బృందంగా కలిసి అడవుల్లో వంటావార్పులు చేసుకుంటూ తిరగడానికి ఇష్టపడుతోందట. అది చూసి… ఈ వయసులోనే ఈమెకు ఇంత వైరాగ్యం ఏంటీ? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.