అభినందనీయ ప్రయోగం… ‘c/o కంచరపాలెం’ చిత్ర సమీక్ష

రానా దగ్గుబాటి సమర్పణ తో వెంకటేశ్‌ మహా దర్శకత్వం లో విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు
 
రాజు(సుబ్బారావు) కంచరపాలెంలోని గవర్నమెంట్‌ ఆఫీస్‌లో అటెండర్‌. తనకు 49 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. దాంతో అందరూ అతన్ని నట్టుగాడు అని ఎగతాళి చేస్తుంటారు. అదే సమయంలో రాజు పనిచేసే ఆఫీస్‌కి ఆఫీసర్‌గా రాధ(రాధ బెస్సి) వస్తుంది. ఆమె వయసు 42 ఏళ్లు. భర్త చనిపోయుంటాడు. 20 ఏళ్ల కూతురు ఉంటుంది. రాజు మనస్తత్వాన్ని చూసిన రాధ అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే తన కుటుంబం ఏమని అనుకుంటుందోనిన భయపడుతుంటుంది రాధ…
గడ్డం(మోహన్‌ భగత్‌) ఓ వైన్‌షాప్‌లో పనిచేస్తుంటాడు. అతను పనిచేసే వైన్‌ షాప్‌ దగ్గరు సలీమా(ప్రవీణ పరుచూరి) వచ్చి ప్రతిరోజూ మందుకొనుక్కుని వెళుతూ ఉంటుంది. గడ్డం తనంటే ఇష్టపడతాడు. అయితే తను గురించి ఓ షాకింగ్‌ విషయం గడ్డంకు తెలుస్తుంది. అదేంటి?
అనాథ అయిన జోసెఫ్‌(కార్తీక్‌ రత్నం)ను ఊరి వ్యాయామశాల ఓనర్‌, రౌడీ అమ్మోరు చేరదీస్తాడు. అతడు కొట్టమన్న వ్యక్తిని వెళ్లి జోసెఫ్‌ చావబాదుతుంటాడు. అలాంటి సందర్భంలో తనకు భార్గవి(ప్రణీత పట్నాయక్‌) పరిచయం అవుతుంది. ముందు ఇద్దరూ గొడవడపడ్డప్పటికీ ప్రేమలో పడతారు. అయితే వీరి ప్రేమకు ఓ విషయం అడ్డొస్తుంది. అదేంటి?
ఏడవ తరగతి చదివే సుందరం(కేశవ కర్రి), తన క్లాసులోని సునీత(నిత్యశ్రీ గోరు)ని ఇష్టపడతాడు. అతని తండ్రి బొమ్మలు చేసి అమ్ముతుంటాడు. అతను పనిచేసే షాప్‌లో ఓ సమస్య ఎదురవుతుంది. దాంతో అతను బొమ్మల వ్యాపారం పెడతాడు. అదే సమయంలో సుందరం.. తనతో సునీతను మాట్లాడేలాచేయమని వినాయకుడికి దండం పెట్టుకుంటాడు. అతను అనుకున్నట్లే జరుగుతుంది. అయితే ఉన్నట్లుండి సునీత ఊరు విడిచి వెళ్లిపోతుంది. ఆ కోపంలో సుందరం ఓ తప్పు చేస్తాడు. ఆ తప్పేంటి? దాని వల్ల అతని జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది?అసలు ఈ నాలుగు జీవితాలకు థ్రెడ్‌ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
 
వెంకటేశ్‌ మహా దర్శకుడిగా, రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిర్మాత పరుచూరి విజయ ప్రవీణను ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు, ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న రానా ను అభినందించి తీరాలి.సినిమా చూస్తున్నంత సేపు కంచెర పాలెం అనే ఊరిలోకి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో ప్రధానంగా ఎనిమిది పాత్రల మధ్యనే కథ నడుస్తుంది. రాజు-రాధ, గడ్డం-సలీమా, జోసెఫ్‌-భార్గవి, సుందరం- సునీత పాత్రల తీరు తెన్నులు వారి బావోద్వేగాల కలయికే కంచరపాలెం. దర్శకుడు వెంకటేష్‌ మహా.. ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు.ఎక్కడా మనకు ఆర్టిఫీసియాలిటీ కనపడదు. నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చాడు.
 
సంభాషణలు మనం రోజూ మాట్లాడుకున్నట్లే ఉంటాయి. ఎక్కడా కృతకంగా అనిపించదు. లైవ్‌ రికార్డింగ్‌ అయినా ..ఎక్కడ ఆడియో డిస్ట్రబెన్స్‌ లేకుండా క్వాలిటీ సౌండ్‌ను అందించారు. స్వీకర్ అగస్తి అందించిన నేపధ్య సంగీతం ఈ సినిమాకే హైలెట్. అగస్తి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. చాలా కాలం గుర్తుండిపోయే పనితనం కనబర్చారు. వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఉంది. ప్రేక్షకులు సినిమాలోకి చేరి చూస్తున్నట్లు అనిపిస్తుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. ఇక, నాలుగు కథలను .. చూసే ప్రేక్షకుడు ఎక్కడా కన్‌ఫ్యూజన్‌ కాకుండా చక్కగా ఎడిట్‌ చేశాడు రవితేజ   -రాజేష్