తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ‘సాక్షి’ టైటిల్ విడుదల 

ఆదర్శ్, చిత్ర శుక్ల హీరో, హీరోయిన్లుగా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, సుదర్శన్, భరణి ముఖ్య తారాగణంగా చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత చేతన్ రాజ్ నిర్మించిన చిత్రం ‘సాక్షి’.  మట్టిపల్లి ఆంథోనీ దర్శకత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో  ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సమాజంలో నేడు  ఆడపిల్లలపై  లైంగిక దాడులు, అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో జనాన్ని ఉద్రేకపరిచే, ఉత్తేజపరిచే వాళ్లకు విజ్ఞానాన్ని పెంపొందింపజేసే చిత్రాలు రావలసిన అవసరం ఉంది. అలాంటి చిత్రమే ఈ ‘సాక్షి’ అని అనుకుంటున్నాను. చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మట్టిపల్లి ఆంథోనీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ సూర్య సూర్యాని మాట్లాడుతూ.. చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ అనేది గుజరాత్ లో ప్రారంభమైంది. అయితే.. తెలుగు సినిమా మీద ప్రేమతో  ఇక్కడికి వచ్చి ‘సాక్షి’ అనే చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం.  మా తొలి ప్రయత్నగా నిర్మించిన ‘సాక్షి’ని ఆశీర్వదించి..ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇదే బ్యానర్ లో వరుసగా సినిమాలు చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. ఈ చిత్రంతో పాటు, మరో రెండు సినిమాలు ఫ్లోర్ మీద ఉన్నాయి. ప్రతీ ఏడాది 3 నుంచి 4 సినిమాలు నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నాం. అందుకు మీ అందరి సహకారం ఎప్పుడూ ఉంటుందని.. ఉండాలని ఆకాక్షిస్తున్నాం అని పేర్కొన్నారు.
హీరో ఆదర్శ్ మాట్లాడుతూ…చేతన్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఒక మంచి సినిమా ద్వారా  హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు అవకాశమిచ్చిన దర్శకులు మట్టిపల్లి ఆంథోనీతో పాటు, లైన్ ప్రొడ్యూసర్ సూర్య సూర్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డైరెక్టర్ ఆంథోనీ టేకింగ్, మేకింగ్ స్టైల్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఆ స్టైల్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. టెక్నీషియన్లకు నా కృతజ్ఞతలు. అందరి కృషివల్లే ఈ ‘సాక్షి’ అవుట్ ఫుట్ అనుకున్న రేంజ్ లో వచ్చింది అని అన్నారు.
క్రియేటివ్ క్రాఫ్ట్స్, మీడియా పార్ట్ నర్ పోణంగి హరీష్ మాట్లాడుతూ… మహిళా ఇతివృత్తము ప్రధానంగా నిర్మించిన ఈ ‘సాక్షి’ చిత్రం టైటిల్ ని ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన  ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక నుంచి మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాలన్నదే మా లక్ష్యంగా పెట్టుకున్నాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ‘తెహల్కా న్యూస్’ ఎడిటర్ కె. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.