‘సైరా’… చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.మెగా అభిమానులకు నిరాశనే మిగులుస్తూ ‘సైరా’ సినిమా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ నటిస్తుండటం.. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
అయితే, ఓ విషయంలో మాత్రం మెగా అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాని ముందుగా ఆగష్టు 15న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావించింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యంతో ఈ సినిమాని అక్టోబర్ 2కు వాయిదా వేశారు. స్వాతంత్ర యోధుడి కథ కావడంతో గాంధీ జయంతి అక్టోబర్ 2న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఫిక్స్ చేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసింది.
అయితే నిరాశపరిచే మరో వార్త మెగా అభిమానులకు చేరింది. ‘సైరా’ అక్టోబర్ 2న కూడా విడుదల కావడంలేదనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో షికారు చేస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాని 2020 జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని టాక్.
విజువల్ ఎఫెక్ట్స్ చేసే టీం నవంబర్ వరకు టైం అడిగిందని.. దీంతో తప్పక ఈ సినిమాని వాయిదా వేశారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సినిమా కావటంతో ప్రచార కార్యక్రమాలకు కూడా ఎక్కువ సమయం తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారకంగా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అతి త్వరలో ప్రకటించనుంది.
నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రత్నవేలు చాయాగ్రాహకుడు.