విలక్షణ నటుడి సక్సెస్ కోసం ‘స్కెచ్’ !

హీరోలు తమ స్టార్ హోదాను దృష్టిలో పెట్టుకొని సినిమాలు  చేస్తారు.  కొందరు మాత్రం  నచ్చిన పాత్ర కోసం వారి ఇమేజ్‌ను మొత్తం పక్కకు నెట్టేసి ….’ప్రయోగం’ అంటే చాలు ప్రాణం పెట్టేస్తారు. అటువంటి వారిలో విక్రమ్ ఒకరు. పాత్ర కోసం దేనికైనా సిద్ధమయ్యే ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. నటన మీద తనకు ఎంత ఇష్టమో తన పాత్రల ద్వారానే చెప్పేస్తాడు. ‘అపరిచితుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విక్రమ్ తమిళ్‌లో స్టార్ హీరో. అయితే గత కొంతకాలంగా ఈ హీరో సరైన విజయాలను అందుకోవడం లేదు. సరైన బాక్సాఫీస్ హిట్ అతనికి దక్కడం లేదు.

2015లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమా కోసం ఏ స్థాయిలో అతను కష్టపడ్డాడో తెలిసిందే. ఆ సినిమా అతనికి నిరాశనే మిగిల్చింది. రావణ్, వీడింతే, శివతాండవంతో పాటు ఇటీవల వచ్చిన చిత్రాలు కూడా అపజయాలనే అందించాయి. పాత్రకోసం ఎంత కష్టపడుతున్నా విక్రమ్‌కు విజయం అందని ద్రాక్షలా మారిపోయింది. అయితే ఈసారి కాస్త కొత్తగా యాక్షన్ ఫిల్మ్‌తో రాబోతున్నాడు విక్రమ్. యంగ్ డైరెక్టర్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ‘స్కెచ్’ సినిమా చేస్తున్నాడు.తమన్నానాయికగా చేస్తున్న ఈ సినిమాలో కూడా విక్రమ్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎలాగైనా నవంబర్ వరకు అన్ని పనులను ముగించేసి డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.  మరి ఈ సినిమాఐనా విక్రమ్ సక్సెస్ కి స్కెచ్ అవుతుందేమో చూడాలి.