కన్నులపండువగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సినీ కార్మికోత్సవం

రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారు అని అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ…
కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి,
చిరంజీవి మాట్లాడుతూ… నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. నేనూ కార్మికుడినే. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటా. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం బాధ్యతగా భావించా.  కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది. 24గంటల్లో 8గంటలు శ్రామికులు పని చేస్తారు. కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదు. అడవిలో ఉంటారు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాము.సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. సినీ కళాకారులు కాదు… సినీ కళా కార్మికులు అని నటుడు రావుగోపాల్ రావు అనేవారని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు ఏం సహాయం కావాల్సిన నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ ద్వారా గుడ్ల ధనలక్ష్మీ 5 లక్షల రూపాయలు చెక్కును తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులమీదుగా అనిల్ వల్లభనేని, దొరై, సురేష్ లకు ఇవ్వడం జరిగింది.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ… తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని అన్నారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయన్న కిషన్‌ రెడ్డి. మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారన్న ఆయన 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని అన్నారు.అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నాం. ఈ-శ్రమ్‌ కార్డులు తీసుకుంటే కార్మికులకు ప్రయోజనాల కలుగుతాయి  అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ…  సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని తెలిపారు.ఆయన ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కోసం చిరంజీవి పెద్ద ఆస్పత్రి కట్టాలని భావిస్తున్నారు. చిత్రపురిలో చిరంజీవి ఆస్పత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగంగా ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం, మతం లేదు. సినీకార్మికులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తాం. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు నిర్మించి  ఇస్తామన్నారు.