లైంగిక వేధింపుల నిర్మాతపై జీవిత కాల నిషేధం !

లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్‌ (పీజీఏ) జీవిత కాల నిషేధం విధించింది. నటీమణుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇప్పటికే పీజీఏకు రాజీనామా చేశారు. నిషేధం కారణంగా మున్ముందు కూడా ఆయన పీజీఏ సభ్యత్వం స్వీకరించే అర్హత కోల్పోతారు. వీన్‌స్టీన్‌ను గిల్డ్‌ నుంచి బయటకు పంపే చర్యలు తీసుకోవాలని ఈ నెల 16వ తేదీనే పీజీఏ నిర్ణయించింది. అయితే, బైలాస్‌ ప్రకారం నిర్దేశిత నిబంధనల ప్రకారమే ఆపని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు చర్య తీసుకోవటానికి 15 రోజుల ముందుగా ఆయనకు నోటీసులు అందజేశారు. స్పందించిన వీన్‌స్టీన్‌ పీజీఏ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

వీన్‌స్టీన్‌ ప్రవర్తనపై వెల్లువెత్తిన పలు ఫిర్యాదులను పరిశీలించిన మీదట… పలువురు బాధితురాళ్లు ఇప్పటికీ తాము పడిన ఇబ్బందులను బహిరంగ పరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పీజీఏ తెలిపింది. లైంగిక వేధింపుల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పీజీఏ పేర్కొంది. దుష్ప్రవర్తన, వేధింపులకు 1970వ దశకం నుంచీ పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది సినీ తారలు ఆరోపణలు చేశారు. ఆయనను ‘బ్రిటిష్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అకాడమీ’ కూడా బహిష్కరించింది. ‘ది వీన్‌స్టీన్‌ కంపెనీ’ కూడా ఆయన్ను వెళ్లగొట్టింది.

ఇలాంటి భర్త నాకొద్దు….

హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌(65)కు మరో గట్టి షాక్‌ ఎదురైంది. ఆయనను విడిచిపెట్టి వెళుతున్నట్లు భార్య ఫ్యాషన్‌ డిజైనర్‌ జార్జియానా చాప్‌మన్‌(41) ప్రకటించింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న హార్వేపై హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించారని కొందరు, లైంగిక దాడి చేశారని ఇంకొందరు ఆయనపై కేసులు పెట్టగా తాజాగా ప్రముఖ నటి ఏంజెలినా జోలి, గైనెత్‌ పాల్ట్రో వంటి నటీమణులు కూడా పెదవి విప్పారు. తమపై కూడా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాన్ని న్యూయార్కర్‌ మేగజిన్‌, డెయిలీ న్యూస్‌ ముఖచిత్రంతో పెద్ద స్టోరిని వేసింది.

దీంతో తారా స్థాయిలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఇలాంటి షాకింగ్‌ విషయాలు తెలిసిన తర్వాత తాను ఇక ఆయనతో ఏమాత్రం ఉండబోనని హార్వే భార్య చాప్‌మన్‌ ప్రకటించారు. 2007లో ఆయనను వివాహం చేసుకున్న చాప్‌మన్‌ ఆరు రోజులపాటు మౌనంగా ఉండి చివరకు ఆయనతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. తొలుత ఆయనకు ఆమె మద్దతిస్తూ వచ్చినప్పటికీ ఆమె… ‘ఫ్యాషన్‌ లేబుల్‌ మార్చెసాను అంతా బహిష్కరించండి!’ …అంటూ ప్రజలు పిలుపునివ్వడంతో ఇక ఆమె వేరే దారి లేక ఆయనతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘మహిళలందరి తరుపున నా హృదయం రోధిస్తోంది. ఇలాంటి క్షమించరాని చర్యలకు బాధితులైన వారిని చూసి నేను బాధపడుతున్నాను. నేను ఇక నా భర్తను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నా పిల్లలను చూసుకోవడమే నాకున్న తొలి ప్రాధాన్య అంశం. ఇలాంటి సమయంలో దయచేసి నాకు కొంత ప్రైవసీ ఇవ్వండని మీడియాను వేడుకుంటున్నాను’ అని ఆమె చెప్పారు.