టెక్నాలజీతో ఎమోషన్స్‌ పండించలేరు !

”నేను మూఢభక్తితో సినిమాలు చేశాను. నటుడికి కమ్యూనికేట్‌ చేయడం తెలియాలి. నిశ్శబ్దంలో కూడా హావభావాలతో చెప్పగలగాలి. ఇవన్నీ స్కూల్స్‌లోనే నేర్చుకోవాలి. దాదాసాహెబ్‌ స్కూల్‌లో అవన్నీ నేర్పుతారనిపిస్తుంది. మంచి పునాది ఉన్న సి . ఉమామహేశ్వరరావులాంటి వారు సారధ్యం వహించడం ఆనందంగా ఉంది. నేను టెక్నాలజీని తప్పుపట్టనుకానీ.. టెక్నాలజీతో ఎమోషన్స్‌ పండించలేరు. ఇక విద్యను నేర్చుకునే విద్యార్థి గురుభక్తి కలిగి ఉండాలి. ఇంకా అడ్మిషన్ల దశలో ఉన్నందున మరోసారి వచ్చి విద్యార్థులకు తగిన సూచనలు ఇస్తానని” … దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్‌ అన్నారు.
హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ‘దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ పిలిం స్టడీస్‌’ లోగోను శనివారం కె. విశ్వనాథ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వీరశంకర్‌, మాదాలరవి, నీలకంఠ, నరసింహారెడ్డి, వినయ్ కుమార్‌ తదితరులు విశ్వనాథ్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ… ”అద్భుతమైన హావభావాలు ఆయన సినిమాల్లో ఉండేవి. అవే నాలో స్ఫూర్తి కలిగించాయి’ అని అన్నారు.

వీరశంకర్‌ మాట్లాడుతూ… ‘ఫాల్కే అవార్డుకే వన్నెతెచ్చిన గొప్ప దర్శకులు విశ్వనాథ్‌గారు. ‘శంకరాభరణం’ చిత్రాన్ని రిక్షావారు కూడా చూసి ఆదరించారు. అందుకే ఆయన మాస్‌ దర్శకుడు అన్నాను. నేను చెప్పింది కరెక్టో కాదో అని తర్వాత చెక్‌ చేసుకున్నా. ఆయనకు ఆ సినిమాకు అవార్డు ఇచ్చినప్పుడు.. ‘మాస్‌ ఫిలింస్‌ విత్‌ ఈస్త్‌టిక్ట్‌ సెన్స్‌’ అని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనతో పంచుకున్నప్పుడు ఆడకపోతే క్లాస్‌, ఆడితే మాస్‌ అనేవారు. సంగీతాన్ని సాహిత్యాన్ని, నాట్యాన్ని కలగలిపి ఆయన సినిమాలు తీసేవారు. భవిష్యత్‌లో తెలుగు సినిమా చూడాలనుకుంటే విశ్వనాథ్‌ గారి చిత్రాలే ముందు వరుసలో ఉంటాయి. ఇక.. స్కూల్‌పరంగా చెప్పాలంటే ఈ స్కూల్‌ సామాన్యుడికి అందుబాటులో ఉంది. ఇంటర్నేషనల్‌ ఫిలిం స్కూల్స్‌లో నేర్చుకోవాలంటే లక్షలు వెచ్చించాలి. అతి తక్కువ ఖర్చుతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ స్కూల్‌ను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా’అని అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ… ‘శంకరాభరణంలో సామాన్యుడికి హీరోగా చేశారు. పాశ్చాత్య కల్చర్‌లోనూ కళ కళ కోసం, సామాజిక చైతన్యం కోసమని సినిమాలు తీసిన గొప్ప దర్శకుడు ఆయన. ప్రతి సినిమాల్లోనూ మానవ విలువలు చూపించారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. రష్యాలో వున్నప్పుడు ‘సాగరసంగమం’ రష్యన్లు చూసి.. తెలుగు సినిమా ఇంత గొప్పగా ఉంటుందని ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించేది. ఇక అమెరికా వంటి దేశాల్లో భారతీయతను పిల్లలకు నేర్పుతున్నారంటే కేవలం ఆయన చిత్రాల స్ఫూర్తితోనే.. అని పేర్కొన్నారు.

నల్గొండ మాజీ ఎం.ఎల్‌ఎ. నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ ‘తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచి ప్రతిభావంతులు ఉపాధ్యాయులుగా ఉన్న ఈ స్కూల్‌ను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సుందర్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయ్ కుమార్ పేర్కొన్నారు.