‘వైశాఖం’లో అన్ని పాటలు చేయడం ఎంతో తృప్తినిచ్చింది !

హరీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్‌గా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. డి.జె. వసంత్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. ‘భానుమతి.. భానుమతి’, ‘కమాన్‌ కంట్రీ చిలకా..’, ‘ప్రార్థిస్తానే..’, వైశాఖం టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్ని పాటలూ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం పోస్టర్స్‌, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో ‘వైశాఖం’ థీమ్‌ టీజర్‌కి 31 లక్షల 50 వేలు వ్యూస్‌ క్రాస్‌ చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌తో ఇంటర్వ్యూ విశేషాలు…

నేపథ్యం…

– మాది విజయవాడ 1996లో హైదరాబాద్‌ వచ్చాను. వచ్చిన కొత్తలో రాకేష్‌ మాస్టర్‌ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాను. తొమ్మిదేళ్ళ క్రితం కొరియోగ్రాఫర్‌గా మారాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 400-500 పాటలకు నృత్య రీతులను సమకూర్చి ఉంటాను. ముఖ్యంగా ఏడాది కాలంగా ఎక్కువ పాటలకు కొరియోగ్రఫీ చేశాను. నాకు సుధీర్‌బాబు హీరోగా చేసిన “ఎస్‌.ఎం.ఎస్‌” సినిమాలో ఇది నిజమే..సాంగ్‌కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సాంగ్‌ చూసి బన్ని నాకు ‘జులాయి’ సినిమాలో టైటిల్‌ సాంగ్‌ కొరియోగ్రఫీ చేసే అవకాశాన్నిచ్చారు. తర్వాత బాద్‌షా ఇలా చాలా సినిమాలకు పనిచేశాను. అన్ని సినిమాలకు మంచి పేరు వచ్చింది. చిరంజీవిగారి 150వ సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాను. రీసెంట్‌గా బన్ని హీరోగా చేసిన డీజే దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాలో “సీటీ మార్‌” పాటకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేశాను. జనతా గ్యారేజ్‌లో పక్కా “లోకల్‌ సాంగ్‌” కూడా నేనే చేశాను.

అవార్డ్స్‌….

– బన్ని హీరోగా చేసిన టాప్‌ లేచిపోద్ది..సాంగ్‌కు మొదటి ఫిలింఫేర్‌ అవార్డ్‌ అందుకున్నాను. తర్వాత బ్రూస్‌లీ సినిమాలో మెగా మీటర్‌..పాటకు ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ వచ్చింది. తర్వాత జనతాగ్యారేజ్‌లో ఆపిల్‌ బ్యూటీ..సాంగ్‌కు మూడోసారి ఫిలింఫేర్‌ అవార్డ్‌ అందుకున్నాను. జులాయి సినిమాకు సైమా అవార్డ్‌ వచ్చింది.

జయగారితో ఇప్పటికీ కలిసి పనిచేయగలిగాను…

– డైరెక్టర్‌ జయగారి దగ్గర పనిచేయాలని చాలా రోజులుగా అనుకునేవాడిని కానీ కుదరలేదు. మంచి మ్యూజిక్‌ సెన్స్‌ ఉన్న డైరెక్టర్‌. ఇప్పుడు ‘వైశాఖం’ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అన్ని పాటలకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేశాను. ప్రతి పాట డిఫరెంట్‌గా ఉంటుంది.

కొత్తవారైనా చక్కగా చేశారు..

– ఇప్పటి వరకు ఏ సినిమా షూటింగ్‌ చేయని కజికిస్థాన్‌లో ‘వైశాఖం’ పాటలను చిత్రీకరించాం. భానుమతి.., కమాన్‌ కమాన్‌ కంత్రి చిలకా.., దగ్గరికి రావద్దు.. అనే మూడు సాంగ్స్‌ను కంపోజ్‌ చేశాం. మైనస్‌ ఐదు డిగ్రీల చలిలో హీరో హీరోయిన్స్‌ డ్యాన్స్‌ చేయడం చాలా గొప్ప విషయం. హరీష్‌, అవంతిక కొత్తవారైనా చాలా చక్కగా డ్యాన్స్‌ చేశారు. రిహారల్స్‌ చేయడం వంటి కారణమే కాకుండా చక్కగా ఫాలో అయ్యారు కాబట్టే ఎక్కడా తడబడకుండా చక్కగా చేశారు.

జయగారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు…

– జయ మేడమ్‌గారు మేకింగ్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. మీకు ఎంత మంది డ్యాన్సర్‌ కావాలి. ఇంకా ఎలాంటి వసతులు కావాలో అడగండి అని చెప్పి నాకు కావాల్సిందంతా సమకూర్చారు. కజికిస్థాన్‌లో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరో ఆడిషన్‌ చేసి సెలక్ట్‌ చేసుకుని వారితో షూటింగ్‌ చేశాం. సినిమా మేకింగ్‌ చూస్తే చిన్న సినిమాలాగా ఎక్కడా కనిపించదు. ప్రతి సాంగ్‌ను ఇష్టపడే చేశాను. ఎక్కడా ఇబ్బంది పడలేదు. నేను కాంప్రమైజ్‌ అవుదామనుకున్నా, జయగారు అన్‌కాంప్రమైజ్‌డ్‌గా చేయించారు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. జయగారి వంటి దర్శకురాలితో కలిసి పనిచేయడం ఎంతో తృప్తినిచ్చింది. జయగారి సినిమాల్లో మ్యూజిక్‌ బావుంటుంది. అందుకే ఆవిడ సినిమాల్లో పనిచేయాలనుకున్నాను. లవ్‌ సినిమా కోసం ఆమెను సంప్రదించాను. కానీ అప్పుడు కుదరలేదు.

అవేర్‌నెస్‌ పెరిగింది..

– ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు డ్యాన్స్‌ గురించి అవేర్‌నెస్‌ పెరిగింది. బాగా కాంపిటీషన్‌ కూడా పెరిగింది. ఈ కాంపిటీషన్‌ను తట్టుకోవాలంటే బాగా ప్రాక్టీస్‌ చేయాల్సిందే.

ఆయన సలహాలేం ఇవ్వలేదు…

– చిరంజీవిగారిని చిన్నప్పటి నుండి స్క్రీన్‌పై చూసిన పెరిగినవాడిని. ఇప్పుడు ఆయనకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేసే అవకాశం రావడం గొప్ప విషయం. ఆ సినిమాలో అవుట్‌ డోర్‌లో ‘మి మి మిమ్మిమి..’ సాంగ్‌ చేశాం. తర్వాత ‘అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు..’ సాంగ్‌ చేశాం. డ్యాన్స్‌ కంపోజ్‌ చేసేటప్పుడు చిరంజీవిగారు మాస్టర్‌ మీరెలా చెబితే అలా చేస్తానని అన్నారే తప్ప ఆయనేం సలహాలివ్వలేదు. చిరంజీవిగారు, చరణ్‌గారు చేసిన స్టెప్‌ తెరపై చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

తదుపరి చిత్రాలు…

– ఇప్పుడు రాంచరణ్‌ ‘రంగస్థలం 1985’ సినిమాతో పాటు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ సినిమా చేస్తున్నాను.