విలన్‌గా విశ్వరూపం చూపుతాడట !

మన హీరోలు జగపతి బాబు , శ్రీకాంత్ ఇప్పుడు విలన్ లుగా  చేస్తున్నారు . ఒకప్పుడు విలన్‌ పాత్రధారులు హీరోలుగా నటించడం ప్రమోషన్‌గా భావించేవారు. కానీ, ఇప్పుడు హీరోలూ విలన్‌గా నటిస్తున్నారు. దర్శకులు నెగిటివ్‌ రోల్‌లో నటించేందుకు సై అంటున్నారు. ఇప్పటికే ‘స్పైడర్‌’లో ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘డాన్సింగ్‌ స్టార్‌’ ప్రభుదేవా కూడా విలన్‌ పాత్రపై మోజుతో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ప్రతినాయకుడిగా తెరపై కనిపించబోతున్నారు…..

ప్రభుదేవాకు బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా పేరుంది. ఆయన చాలా గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌కు ‘దేవి’ చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ అయ్యారు. తాజాగా హన్సికతో కలిసి ‘గులేబకావళి’, నటి లక్ష్మీమీనన్‌తో ‘యంగ్‌ మంగ్‌ జంగ్‌’ చిత్రాల్లో నటిస్తున్న ఈయన.. ‘మెర్క్యురీ’లో విలన్‌గా విశ్వరూపం చూపించబోతున్నారు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బుల్లితెర నటుడు సనత్‌రెడ్డి హీరోగా నటిస్తున్నారు. దీపక్‌ పరమేశ్, రమ్యా నంబీశన్   ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మెర్క్యురీ’ సినిమా షూటింగ్‌ చాలా సైలెంట్‌గా పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమాలో ప్రభుదేవా విలన్‌గా నటిస్తున్నారన్న వార్తలతో అభిమానులు  ఆయన విలనిజాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.