వెండితెర‌పై నటుడిగా ద‌ర్శ‌కేంద్రుడి సంద‌డి !

వెంక‌టేశ్‌, మ‌హేశ్‌, అల్లు అర్జున్‌, శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, ట‌బు, తాప్సీ వంటి ఎంద‌రో స్టార్స్‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌ అందించారు ద‌ర్శ‌కేంద్రుడు,శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు.. తొలిసారి వెండితెర‌పై న‌టుడిగా కనిపించి సందడిచేయనున్నారు.
ద‌ర్శ‌కేంద్రుడి శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పెళ్లి సంద‌D’. ఈ చిత్రంలో రాఘవేంద్ర‌రావు తొలిసారి న‌టిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు వ‌శిష్ఠ అనే పాత్ర‌లో న‌టించారు. వ‌శిష్ఠ పాత్ర‌కు సంబంధించిన స్పెష‌ల్ ప్రోమోను రాఘవేంద్ర‌రావు శిష్యుడు..ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.
ఈ స్పెషల్ ప్రోమోలో కె.రాఘవేంద్రరావు సరికొత్త లుక్, ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు.మ‌రి వ‌శిష్ఠ‌గా రాఘ‌వేంద్ర‌రావు ఎలా మెప్పించారో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్ట‌ర్ గౌరి రోణంకి. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ‘పెళ్లి సంద‌D’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.