దాసరి పుట్టినరోజు వేడుకలు ; విగ్రహావిష్కరణ

‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్‌ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్‌ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్‌లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్‌ నటుడు కృష్ణ అన్నారు.

దర్శకరత్న, నిర్మాత, నటుడు డా.దాసరి నారాయణరావు 71వ జయంతి వేడుకలను తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందించింది. దాసరి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ…. దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ తన చిత్రాల ద్వారా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. తన సినిమాల ద్వారా దాసరి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయనిర్మల, బాలకృష్ణ, సి.కల్యాణ్,  నిర్మాత, ఫిలింనగర్‌ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, అల్లు అరవింద్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలు తీశారు.ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్‌లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్‌ అన్నారు.

మే 4.. డైరెక్టర్స్‌ డే
దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్‌ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం.ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమం లో వేదికపై డైరెక్టర్స్‌ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్‌ డే’ అని అనౌన్స్‌ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్‌ డేగా అనౌన్స్‌ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్‌. నారాయణమూర్తి.

తనికెళ్ల భరణి ‘సినిమా’  మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్‌పై చంద్రబోస్‌ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి   సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌.

స్వగృహంలో జయంతి వేడుకలు
దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్‌ ఇన్ఫో గ్లోబల్‌ లిమిటెడ్‌’ ఛైర్మన్‌ బీయస్‌యన్‌ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్‌ అకాడమీ వెబ్‌సైట్‌’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు.కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ‘ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు’ అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్‌ ఇయర్‌లో చూశాం’’ అన్నారు.

ఇక దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు ఆయనను గుర్తుచేసుకుంటూ తమ సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. దాసరి నారాయణరావు లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. గొప్ప హృదయం ఉన్న వ్యక్తి దాసరి అని… చిత్ర పరిశ్రమలో ఎందరికో ఆయన మార్గదర్శి అని దర్శకుడు శ్రీనువైట్ల పేర్కొన్నారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు, సినిమా ఇంటికి పెద్ద దాసరి నారాయణరావుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.