దాసరి కాంస్య విగ్రహాన్నిఆవిష్కరించిన మోహన్‌బాబు

దాసరి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన కాంస్య విగ్రహాన్ని మోహన్‌బాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం నెత్తిన పాలుపోసిన పాలకొల్లు ప్రజలను ఎన్నడూ మరిచిపోనన్నారు. భక్తవత్సలం నాయుడుగా ఉన్న తనకు మోహన్‌ బాబుగా నామకరణం చేసి హాస్యనటుడిగా, విలన్‌గా, కథానాయకుడిగా అవకాశాలిచ్చి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన దాసరి నారాయణరావును చిత్ర పరిశ్రమకు అందించిన ఘనత పాలకొల్లుదన్నారు. అగ్ర కథానాయకులు కూడా అవకాశాల కోసం దాసరిని ప్రాథేయపడేవారని అన్నారు. దాసరి ఓ మహాగ్రంథమని అభివర్ణించారు. దాసరి నారాయణరావు స్మారకంగా సొంతూరులో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే, ఆయన ఎంతో సేవ చేసిన హైదరాబాద్‌లో మాత్రం విగ్రహం కోసం ఐదు గజాల స్థలం కూడా కేటాయించలేద’’ని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.దాసరి గౌరవార్థం పాలకొల్లుకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు తన విద్యానికేతన్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ వరకు చదివిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, నటుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ దాసరి దర్శకత్వంలో దాదాపు 40 సినిమాలు చేసిన ఘనత తనకే దక్కిందన్నారు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే అసాధ్యమంటూ లేదని దాసరి నిరూపించారన్నారు. పాలకొల్లు వాసులంతా ఈ సూత్రాన్ని అనుసరించి మంచి భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సినీనటులు ప్రభ, శ్రీకాంత్‌, శివాజీరాజా, కవిత, హేమ, సంగీత దర్శకుడు కోటి, దర్శకులు రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, నిర్మాత సి.కళ్యాణ్‌ పాల్గొన్నారు.