ఈసారి నా బర్త్‌డే వేడుక ఎక్స్‌ట్రా స్పెషల్‌ !

బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె …. రణ్‌వీర్‌ సింగ్‌తో నాలుగేళ్ల క్రితమే తనకు నిశ్చితార్థం జరిగిందని షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె. ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌కు దీపిక ఫొటో షూట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను మ్యాగజైన్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు రణ్‌వీర్‌తో నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగింది. కానీ ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. అప్పటికీ మా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి’ అన్నారు.
 
ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘అప్పుడే ఎందుకు పెళ్లిచేసుకోలేదు?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరలో దీపిక తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. పెళ్లయ్యాక వచ్చిన తొలి పుట్టినరోజు వేడుకల గురించి చెబుతూ.. ‘ఈసారి నా బర్త్‌డే వేడుక ఎక్స్‌ట్రా స్పెషల్‌గా ఉండబోతోంది. హనీమూన్‌తో పాటు ఒకరి భార్యగా తొలి పుట్టిన రోజును జరుపుకోబోతున్నాను. అంతేకాదు.. ‘సింబా’ సక్సెస్‌ను కూడా ఎంజాయ్‌ చేయబోతున్నాం. కానీ ఇప్పుడైతే హాలిడే ట్రిప్‌ గురించి ఆలోచించడం లేదు. సినిమాలతో బిజీగా ఉన్నాం.’ అని వెల్లడించారు.
 
ఇది గాయపడి గెలిచిన వ్యక్తి కథ 
‘ఇది గాయపడి గెలిచిన వ్యక్తి కథ. ఇది ఓ మనిషి దృఢమైన ఆత్మవిశ్వాసం’ అని అంటోంది దీపికా పదుకొనె. ఇటీవల రణ్‌వీర్‌ సింగ్‌ను వివాహం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. గతేడాది ‘పద్మావత్‌’లో మెరిసిన దీపికా ఆ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు. తాజాగా ఆమె మేఘనా గుల్జర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఢిల్లీ యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందబోతున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమాకు ‘ఛాపక్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందని దీపికా ట్వీట్‌లో పేర్కొంది. ఇందులో లక్ష్మి పాత్రలో దీపిక కనిపించనున్నారు. లక్ష్మి భర్త దీక్షిత్‌గా పాత్రికేయుడు అలోక్‌ నటిస్తున్నారు. విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ‘సరైన నటీనటుల కోసం ఇన్నాళ్ళు చూశా. ఈ కథలోని పాత్రలకు సరిపోయే నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది’ అని దర్శకురాలు మేఘనా గుల్జర్‌ తెలిపారు. ఈ సినిమాకు దీపికా పదుకొనె సహనిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. మార్చిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.
‘సూపర్ హీరో’ కోసం పనిచేస్తున్నా!
మరోవైపు ‘సూపర్ హీరో’ చిత్రంలో దీపిక నటిస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటీవల దీపిక మాట్లాడుతూ ‘ఇది నిజమే. ఇప్పటికే ఈ సినిమా కోసం పనిచేస్తున్నాను. కథ ఇంకా పూర్తికాలేదు. టీమ్‌వర్క్ జరుగుతోంది’ అంటూ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. కాగా త్వరలో దీపిక, రణవీర్‌లు హనీమూన్‌కు వెళ్లనున్నారు. రణవీర్ తన ‘సింబా’ సినిమా ప్రమోషన్‌లో ఉన్న కారణంగా వీరి హనీమూన్ వాయిదాపడింది. త్వరలో రణవీర్ ‘83’ సినిమాలో నటించనున్నారు.