దానికి కారణం నేను నాలాగే ఉన్నా!

“నేను చిన్నప్పుడు ఏదైతే అనుకున్నానో, అదే విధంగా నా సినీ కెరీర్‌ ప్రారంభమైంది’ అని అంటున్నారు దీపికా పదుకొనె. విభిన్నమైన కథా నేపథ్య చిత్రాల్లో భాగమవుతున్న ఆమె తన కెరీర్‌ ప్రారంభం గురించి చెబుతూ, ‘మేం కుటుంబంతో కలిసి ఏడాదికి కేవలం రెండు సినిమాలు చూసేవాళ్ళం. సినిమా చూసే ప్రతి సారి నేను కూడా సినిమాల్లో నటిస్తానని అనుకునేదాన్ని. అలాగే మోడలింగ్‌లోకి వెళ్ళాను. అట్నుంచి సినిమాల్లోకి వచ్చాను. అప్పుడు ఏదైతే అనుకున్నానో అలానే జరిగింది. నటన పరంగా నేను ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నాకు ఏదీ వస్తే అదే సొంతంగా చేశా. ఈ క్రమంలో నటన పరంగా, సినిమాల పరంగా పరాజయం చెందాను. క్రమక్రమంగా నన్ను నేను మెరుగుపరుకుంటూ, సాధికారత దిశగా అడుగులు వేశాను. నేను కాన్ఫిడెంట్‌గా చేసిన ప్రతిసారి మంచి ప్రశంసలు వచ్చాయి. దీపికా ఏం మారలేదని చాలా మంది అంటుంటారు. దానికి కారణం నేను నాలాగే ఉన్నా. ఇప్పుడు మంచి స్క్రిప్ట్స్‌ వస్తున్నాయి. క్రియేటివ్‌ సైడ్‌ స్వేచ్చగా నా అభిప్రాయాలు చర్చించగలుగుతున్నా. నచ్చిన స్క్రిప్ట్స్‌ ఎంపిక చేసుకుం టున్నా. ప్రజెంట్‌ టైమ్‌ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’ అని అన్నారు.

ప్రతిక్షణమూ పోరాటమే డిప్రెషన్‌ గురించి ఇదివరకు మాట్లాడారు దీపికా పదుకోన్‌. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రతి రోజూ  పోరాటమే అన్నారామె. డిప్రెషన్, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయం గురించి దీపికా పదుకోన్‌ ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో వివరించమంటే ‘పోరాటం’ అని చెబుతాను. ప్రతిక్షణమూ పోరాటమే. ఎప్పుడూ అలసిపోయినట్టు అనిపించేది. అయితే ఈ మధ్యన చాలా మంది  బాధపడతుండటాన్ని కూడా డిప్రెషన్‌ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

అసలు డిప్రెషన్‌ అంటే ఏంటే అర్థం చేసుకోవాలి. నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని బయటకు చెప్పినప్పుడు నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. నన్ను కిందకు తొక్కేస్తున్న బరువంతా తీసినట్టు.. మనసంతా చాలా తేలికగా అనిపించింది. ‘డబ్బు, పేరు, కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు డిప్రెషన్‌’ అని కొందరు వాదిస్తారు. డిప్రెషన్‌ అనేది మానసిక సమస్య. మన చేతుల్లో, మన కంట్రోల్‌లో లేని విషయం అని తెలుసుకోవాలి’’ అన్నారు. ప్రస్తుతం దీపికా పదుకోన్‌ ‘చప్పాక్, 83’ సినిమాలతో బిజీగా ఉన్నారు.