అమీర్‌ ఖాన్‌ ‘మహాభారత్’ లో ద్రౌపది దీపిక ?

‘రామ్‌లీలా’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ వంటి తదితర చిత్రాల్లో యుద్ధనారిగా, అత్యంత శక్తివంతురాలైన మహిళగా నటించి మెప్పించిన దీపికా పదుకొనె తాజాగా ద్రౌపదిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. సినిమా కోసం నటీనటుల ఎంపికలో ప్రస్తుతం చిత్ర బృందం ఉందని, మహాభారతంలో కీలకమైన ద్రౌపది పాత్రలో దీపికా పదుకొనెని తీసుకోవాలనే యోచనలో అమీర్‌ ఖాన్‌ ఉన్నారట. అలాగే పాండవులుగా, కృష్ణుడిగా, కౌరవుల్లో ముఖ్యలుగా ఎవరెవరు నటిస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే ద్రౌపదిగా దీపికాను అమీర్‌ఖాన్‌ ఎంచుకోవడాన్ని చిత్ర బృందం సైతం చాలా పాజిటివ్‌గా స్పందించిందట. ఈ పాత్రకు దీపికా నూటికి నూరుశాతం న్యాయం చేయగలదనే నమ్మకంతో అందరూ ఉన్నారట. ద్రౌపదిగా నటించేందుకు దీపికా సైతం సుముఖంగా ఉన్నట్టు సమాచారం.
‘పద్మావత్‌’ చిత్రం తర్వాత దీపికా నటించే తదుపరి చిత్రం ఇంకా ఖరారు కాలేదు. షారూఖ్‌ ఖాన్‌ నటిస్తున్న ‘జీరో’ చిత్రంతో అతిథిగా మెరవనుంది.

‘రైట్‌ వర్సెస్‌ రాంగ్‌’గా జరిగితే బావుంటుంది !

హాలీవుడ్‌లో హార్వీ వెయిన్‌స్టీ  లైంగిక వేధింపుల విషయం ఎంత దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా మంది హీరోయిన్స్‌ ‘మీటూ’ అంటూ ముందుకొచ్చి తమకు జరిగిన సంఘటనలు బయటపెట్టారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడటం కోసం హాలీవుడ్‌ సెలబ్రిటీలందరూ కలిసి ‘టైమ్స్ అప్‌’ అనే మూమెంట్‌ను స్థాపించారు. ఇదో ఫండ్‌రైజింగ్‌ ఆర్గనైజేషన్‌. ‘టైమ్స్‌ అప్‌’ సంస్థ అవసరం ఇక్కడ కూడా ఉందా? అని  బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోనె ని అడిగితే….

‘‘ కచ్చితంగా ఉంది.‘టైమ్స్‌ అప్‌’ లాంటి మూమెంట్‌ను ప్రమోట్‌ చేయడానికి నేను రెడీ. హాలీవుడ్‌ సెలబ్రిటీల్లాగా నేనూ దీన్ని ప్రమోట్‌ చేస్తాను. కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కాకుండా జెండర్‌ ఈక్వాలిటీ కూడా ఇందులో డిస్కస్‌ చేయాలి. మనం ‘స్త్రీలను కాపాడుకోవాలి’ అంటుంటాం కదా.. అలాగే కొందరు పురుషులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఉద్యమాలన్నీ కూడా మేల్‌ వర్సెస్‌ ఫీమేల్‌ పోరాటంలాగా జరగకూడదు. కేవలం రైట్‌ వర్సెస్‌ రాంగ్‌గా జరిగితే బావుంటుంది అని అభిప్రాయపడుతున్నా’’ అని పేర్కొన్నారు దీపిక.